Sunday, December 22, 2024

సినీ గ్లామర్ గట్టెక్కిస్తుందా?

- Advertisement -
- Advertisement -

సినీ నటులు రాజకీయ ప్రవేశం చేసి రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయడం లేదా ప్రముఖ రాజకీయ పార్టీలలో కీలక పాత్ర పోషించడం దక్షిణాదిన, ముఖ్యంగా తమిళనాడు నుండే ప్రారంభమైంది. సినీ నేపథ్యం గల కరుణానిధి ముఖ్యమంత్రి పదవి చేపట్టినా ఎంజి రామచంద్రన్ నుండే సినీ గ్లామర్ రాజకీయాలలో కీలకం కావ డం ప్రారంభమైంది.ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టి రామారావు తెలుగు దేశం పార్టీ స్థాపించడంతో రాజకీయాల్లో సినీ నటుల ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. తాజాగా, తమిళనాడులో ప్రముఖ నటుడు తమిళగ వెట్రి కజగం (టివికె) పార్టీ స్థాపించడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. అయితే, సినీ రంగం నుండి రాజకీయాలలో కీలక శక్తిగా ఎదగాలని మరెందరో ప్రయత్నించి విజయం సాధించలేక పోవడం గమనార్హం. తమిళనాడులోనే విజయకాంత్, ఆంధ్ర ప్రదేశ్‌లో చిరంజీవి అందుకు ఉదాహరణలు. పవన్ కళ్యాణ్ సైతం ఓ దశాబ్దకాలం తర్వాత రాజకీయాలలో కొంత చోటు సంపాదించుకోగలిగారు.

గత ఫిబ్రవరిలోనే తన రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ప్రకటించిన విజయ్ ఇప్పుడు పార్టీని అధికారికంగా ప్రారంభించి, 2026 ఎన్నికలు లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. తన రాజకీయ ప్రయాణం గురించి స్పష్టమైన అవగాహనతోనే విజయ్ ముందడుగు వేస్తున్నట్లు ఆయన ప్రసంగం వెల్లడి చేస్తుంది. ఇప్పుడే ఎన్నికల అనంతరం సర్దుబాట్ల గురించి, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు గురించి ప్రస్తావించారు. ఒక వంక బిజెపిని, మరోవంక అధికారంలో ఉన్న డిఎంకెని తన రాజకీయ ప్రత్యర్థులుగా గుర్తించినట్లు ఆయన ప్రసంగ ధోరణి వెల్లడి చేస్తుంది. అంటే, డిఎంకె వ్యతిరేక ఓటర్లను, ఒక విధంగా ఎఐఎడిఎంకె మద్దతుదారులను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ విధంగా చేయడం ద్వారా డిఎంకె వ్యతిరేక ఓట్లను చీల్చి, డిఎంకె తన స్థానాన్ని సుస్థిరం చేసుకొనేందుకు పరోక్షంగా సహకరించినట్లు అవుతుందని అన్నాడిఎంకె వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

అప్పట్లో ఎంజిఆర్, ఆ తర్వాత ఎన్‌టిఆర్ రాజకీయ పార్టీలను స్థాపించిన సమయంలో ఓ రకమైన ‘రాజకీయ శూన్యత’ నెలకొంది. అధికార పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరుగుతూ ఉండటం, అధికార పార్టీని దీటుగా ఎదుర్కొనే ప్రతిపక్షం లేకపోవడం వారికి కలిసి వచ్చింది. అటువంటి పరిస్థితులు ఇప్పుడు తమిళనాడులో లేవని చెప్పాలి. చిరంజీవి సైతం ఇటువంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసి విజయం సాధించలేకపోయారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా జనసేనను స్థాపించి 2019 ఎన్నికలలో ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోయారు. తమిళనాడులో గతంలో విజయకాంత్ సైతం ఇటువంటి పరిస్థితులలోనే విజయం సాధించలేకపోయారు. విజయ్ కన్నా ఎక్కువ ప్రజాకర్షణ ఉన్నప్పటికీ చెప్పుకోదగిన ఫలితం సాధింపలేక పోయారు. తమిళనాడులోనే కమల్ హాసన్ సైతం సొంతంగా పార్టీ ప్రారంభించి బొక్కబోర్లాపడ్డారు. రజనీకాంత్ పార్టీ ప్రారంభానికి అంతా సన్నాహాలు చేసుకొని కూడా చివరి నిమిషంలో వెనుకడుగువేశారు.

వీరందరికి మించిన మద్దతును విజయ్ సమకూర్చుకోగలరా? పైగా రాజకీయ లక్ష్యాలు, విధానాలు పట్ల స్పష్టమైన అవగాహన ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమిళనాడులో గతంలో జయలలిత విజయం సాధించినా ఆమె ఎంజి రామచంద్రన్ ప్రోత్సాహంతో రాజకీయాలలో నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత ఆయన మరణంతో ఏర్పడిన ఆ శూన్యాన్ని ఆమె భర్తీ చేయగలిగారు. సినీనటుల రాజకీయ సభలకు విశేషంగా జనం హాజరైనప్పటికీ వారిని ఓటర్లుగా మార్చుకోవడం అంత తేలిక కాదని గతంలోని పలువురి అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. సినీ నటులు ఎక్కువగా తమ అభిమానులపై ఆధార పడుతూ ఉంటారు. అయితే అభిమానుల పట్ల సామాజికంగా చెప్పుకోదగిన గౌరవ మర్యాదలు ఉండవు. వారిని ‘గాలికి తిరిగేవారు’ గా వాటి కుటుంబ సభ్యులే భావిస్తూ ఉంటారు. అందుకనే ఓటర్లపై నిర్ణయాత్మక ప్రభావం చూపలేరని చిరంజీవి, కమల్ హాసన్, పవన్ కళ్యాణ్ వంటి వారి అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.

2008లో తిరుపతి నుండి తన లక్షలాది మంది అభిమానులు, ప్రజల సమక్షంలో తన ‘ప్రజారాజ్యం’ పార్టీని ప్రారంభించిన గొప్ప నటుడు చిరంజీవికి నిజానికి ఈరోజు తమిళనాడులో విజయ్ కంటే ఎక్కువగా ప్రజాదరణ ఉంది. కానీ ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ కేవలం 18 ఎంఎల్‌ఎలను మాత్రమే గెలుచుకోగలిగారు. చివరకు పార్టీని ప్రారంభించిన మూడేళ్లలోనే ఎన్నికల ప్రచారంలో ఏ కాంగ్రెస్ పార్టీపై దాడికి పాల్పడ్డారో అదే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాబట్టి, ఎన్నికల్లో, ఓటింగ్ సరళిలో ప్రజాదరణ,- కీర్తి-, గ్లామర్ వనరులు మాత్రమే ప్రభావం చూపవని గ్రహించాలి. అయితే ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ ఎంతో సహనం ప్రదర్శించడం ద్వారా, పట్టుదలతో జనసేన పార్టీని 2024 ఎపి అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన విజయం వైపు నడిపించగలిగారు. 2008లో తన సొంత సోదరుడు చిరంజీవి పార్టీ యువజన విభాగం చీఫ్‌గా ఉన్న రోజుల నుండి ఆయన చాలా కష్టపడ్డారు.

ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత అతను 2014 లో తన స్వంత ‘జనసేన’ పార్టీని ప్రారంభించారు.
ఇటీవలి ఎన్నికల వరకు అనేక రాజకీయ, సంస్థాగత సవాళ్లు ఎదుర్కొన్నారు. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు అసెంబ్లీ స్థానాల్లోనూ ఓడిపోయారు. ఒక దశలో కమ్యూనిస్టులతో కలిసి, ఆ తర్వాత బిజెపిలోకి వెళ్లి, రాష్ట్ర సమస్యలపై బిజెపితో దోస్తీ మొదలైన తర్వాత మళ్లీ బయటకు వచ్చారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కాగలిగారు. సరైన పొత్తు, సర్దుబాటు కారణంగా ఆయనకు విజయాన్ని అందించడంతో ఆయన రాజకీయ వైఖరిని ఇప్పుడు చాలా మంది కొనియాడుతున్నారు. పైగా, ఇప్పుడు తమిళనాడులో డిఎంకె ప్రభుత్వ పాలనపట్ల వెంటనే గద్దె దించాలన్న ఆగ్రవేశాలు ప్రజలలో ఉన్న సంకేతాలు లేవు. విజయ్ జరిపిన తొలి బహిరంగసభను చూస్తే అంత ‘ఏకపాత్రాభినయం’ మాదిరిగా ఉంది. ముందుగా క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం పట్ల దృష్టి సారించాలి.

బిజెపి, డిఎంకెలను తన రాజకీయ ప్రత్యర్థులనే సంకేతాలు ఇచ్చినా వాటి పేర్లను ప్రస్తావించిన దాఖలాలు లేవు. పైగా, సైద్ధాంతికమైన నిబద్ధతను స్పష్టంగా ప్రదర్శింపలేకపోయారు. ఎంజిఆర్, ఎన్‌టిఆర్ రాజకీయ ప్రవేశానికి ముందుగానే తన చిత్రాల ద్వారా ప్రజలకు సందేశాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. సామాజిక సమస్యలపై తమ చిత్రాల ద్వారా గొంతు విప్పే ప్రయత్నం చేశారు. కానీ విజయ్ సినిమాలు వ్యాపార ధోరణిలో ఉండటం తప్ప అటువంటి సందేశాత్మక చిత్రాలు పెద్దగా లేవు. కేవలం సినీ గ్లామర్‌తో మాత్రమే రాజకీయాలలో నిలదొక్కుకోవడం అందరికీ సాధ్యం కాదు. అమితాబ్ బచ్చన్ వంటి వారే ఒకసారి లోక్‌సభకు ఎన్నికై, ఆ తర్వాత రాజకీయాలకు సరిపోనని వెనుకడుగు వేశారు. మొన్నటి వరకు బిజెపి కూటమిలో కీలకంగా వ్యవహరించిన ఎఐఎడిఎంకె తమిళ ప్రజలు ఆ పార్టీని ఆదరింపరని గ్రహించి ఆ పార్టీకి దూరంగా జరిగింది.

డిఎంకె మొదటి నుండి కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్నది. అందుకనే విజయ్ అనుసరించే ‘బిజెపి వ్యతిరేక ధోరణి’ రాజకీయంగా పెద్దగా ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదు. మన దేశంలో ప్రతి రాజకీయ పక్షం కూడా కొన్ని బలమైన సామాజిక వర్గాలు లేదా మైనారిటీల మద్దతుపై ఆధారపడుతున్నాయి. కానీ విజయ్‌కు అటువంటి సౌలభ్యం కనిపించడం లేదు. ఆయన కేవలం తన గ్లామర్ మీదనే ఆధారపడుతున్నట్లు కనిపిస్తున్నది. ఆయన అవినీతి గురించి ప్రస్తావించినా నేడు ప్రతి పార్టీ అదే భాషలో మాట్లాడుతున్నది. అయితే అధికారంలోకి రాగానే తమ ధోరణిని మార్చుకుంటున్నది. అవినీతి ఆరోపణలపై పార్టీలు ఓటమి చెందిన సందర్భాలు మన దేశంలో చాలా తక్కువగా ఉన్నాయని గ్రహించాలి. ఏదేమైనా తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ క్లిష్టతరంగానే ఉంటాయి. సాధారణ రాజకీయ సమీకరణాలను బట్టి ప్రభావాన్ని అంచనా వేయలేము. తమిళ రాజకీయాలలో విజయ్ ఎటువంటి ప్రభావం చూపగలరా చూడాల్సి ఉంది.

చలసాని నరేంద్ర
98495 69050

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News