ఏ ప్రభుత్వాసుపత్రి
శవాల కొట్టు ముందయినా
ఒక కన్నీటి మడుగుని చూశారా..
-అదీ మా అమ్మే
ఏ సమాధుల దొడ్లోనయినా కనీసం
చావుబండకి నోచుకోని బొందమీద
మొలిచిన ఏకాకి శిలువని చూశారా..-
అదీ మా అమ్మేనండీ
అందరి తల్లులు ఆదమరిచి
సుఖనిద్రలు పోతున్నప్పుడు
నా కూలితల్లి పంటకుప్పల
మధ్య పరాభవమైపోయింది
ఉన్న తల్లులంతా ఉత్తమ మాతల
పురస్కారాలందుకుంటున్నప్పుడు
నా వాడతల్లి గుక్కెడు నీళ్లు తాగినందుకు
జరిమానాలు కడుతూ వుంది
అందరి తల్లులు అపరనాయకురాళ్లయి
ఏలికలు చేస్తున్నప్పుడు
నా అలగాతల్లి ప్రభుత్వాఫీసుల
ముందు ధర్నాలు చేస్తూవుంది
ఎవరికైనా అమ్మంటే పాలుపడుతూనో
జోలపాడుతూనో గుర్తొస్తే
నాకు మా అమ్మ కలుపుతీస్తూనో
తట్టలు మోస్తూనో గుర్తొస్తుందండీ
కోడికూసింది మొదలు రాత్రికి
నాన్న తట్టిందాకా
తనకసలు ఒక ఆడదాన్నన్న
సంగతే గుర్తుకురాని
నా మొరటు తల్లిమీద
ఏం రాయమంటారండీ
…
నాకు మా అమ్మెప్పుడూ
జోల పాడలేదండీ
దాని గొంతెప్పుడో ఆకల్తో పూడుకుపోయింది
నన్ను మా అమ్మెప్పుడూ జోకొట్టనైనా లేదండీ
దాని చేతులెప్పుడో వ్యవసాయ పనిముట్లుగా
మారిపోయాయి పిల్లలందరూ
తమ తమ తల్లుల చిటికెనేళ్లు పుచ్చుకొని
వనభోజనాలకెళ్తుంటే
నేను మా అమ్మడొక్కలోయలోకి
ముడుక్కుని పడుకున్నాను సార్!
బిడ్డలంతా తమ తల్లుల్ని ప్రత్యక్షదైవాలుగా
కీర్తిస్తుంటే నేను ఫీజు కట్టలేని
నా పేద తల్లిని కసిదీరా
తిట్టిపోస్తున్నాను సార్
కొడుకులందరూ తమ కలిగిన తల్లుల
తలనెప్పులకే తల్లడిల్లుతున్నప్పుడు
నేను నా రోగిష్టితల్లి ఇంకా
ఎందుకు చావలేదా అని
గొణుక్కున్నాను సార్
ఏం చెప్పమంటారండీ!
వానలో తడిసొచ్చి తుడుచుకుందామని
అమ్మ కొంగందుకుంటే
కోటి మాసికలు నన్ను వెక్కిరించాయండీ
చిన్నప్పుడు ఆకలై మా అమ్మరొమ్ముని
ఆబగా నోటికదుముకుంటే
నాకు దాని పక్కెటెముకలు
గుచ్చుకున్నాయండీ ఏదేమైనా సార్!
సాటిమనుషుల్ని పశువులుగా చూసే
పశువుల్ని కని పశుమాతలుగా
దూషించబడుతున్న
లక్షలాది తల్లుల మధ్య
మనిషికాక మరేమికాని నా తల్లి గురించి
చెప్పాలంటే.. ఈ భాషా ఈ కవిత్వమూ
ఎప్పటికీ సరిపోవుసార్!
మద్దూరి నగేష్ బాబు