యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగచైతన్యతో ఇంటర్వూ విశేషాలు..
క్లైమాక్స్ చాలా గొప్పగా…
నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్, హై బడ్జెట్ మూవీ తండేల్. క్యారెక్టర్, స్టొరీ అన్ని రకాలుగా బిగ్ స్పాన్ వున్న సినిమా ఇది. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది. చివరి ముఫ్ఫై నిమిషాలు, క్లైమాక్స్ చాలా గొప్పగా ఉంటాయి.
అలా జర్నీ మొదలైంది…
ఈ కథ మొదట ఓ ఐడియాగా చెప్పారు. పాత్రకు తగ్గట్టుగా మారాలంటే వాళ్ళ లైఫ్ స్టయిల్ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి శ్రీకాకుళంలో వాళ్ళని నేరుగా కలవాలని వెళ్లాం. మొత్తం హోం వర్క్ చేశాక నేను చేయగలనని నమ్మకం ఏర్పడిన తర్వాత జర్నీ మొదలైంది.
ఛాలెజింగ్‌గా అనిపించింది…
ప్రతి సినిమాతో ఇంకా బాగా నటించాలని ప్రతి నటుడికి ఉంటుంది. అయితే ఈ కథతో రియల్ లైఫ్ క్యారెక్టర్ దొరికింది. యాక్టర్‌గా నెక్స్ స్టెప్ వెళ్ళే అవకాశం ఈ సినిమాలో కనిపించింది. దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్‌ఫర్మేషన్ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాస గురించి ట్యూషన్ తీసుకున్నాను. యాస నిజంగా ఛాలెజింగ్‌గా అనిపించింది.
ఇది నాకు స్ఫూర్తినిచ్చింది…
దర్శకుడు చందుతో నాకు ఇది మూడో సినిమా. తనతో ప్రయాణించడం ఇష్టం. నన్ను కొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తాడు. నా కోసమే ఆలోచిస్తుంటాడు. ఈ సినిమా కమర్షియల్‌గా తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. ఇక నాకు ఎప్పటి నుంచో రియల్ లైఫ్ స్టొరీస్ ఆధారంగా సినిమా చేయాలని వుండేది. పైగా ఇది మన తెలుగోళ్ళ కథ. ఇది నాకు స్ఫూర్తినిచ్చింది.
రాజు పాత్రని ఎంచుకోవడానికి కారణమిదే…
రాజు ఓ ఫైటర్. జైల్లో ఉన్నప్పుడు బాధని ఓర్చుకొని తన వారికోసం ఎలా పోరాటం చేశాడు? ఎలా బయటికి వచ్చాడనేది చాలా గొప్పగా వుంటుంది. తన ప్రేమకథే తనకి బలాన్ని ఇస్తుంది. రాజు పాత్రని ఎంచుకోవడానికి కారణమిదే.
సముద్రంలో షూట్ చేశాం…
‘తండేల్’ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. లవ్ స్టొరీ వెనుక మిగతా లేయర్స్ వుంటాయి. శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడ బోట్స్ ని లీజ్ కి తీసుకొని ఫిషింగ్ చేసుకొని అక్కడే అమ్మి తిరిగివస్తారు. ‘తండేల్’ అంటే లీడర్. ఇది గుజరాతీ పదం. సినిమాని దాదాపు సముద్రంలో షూట్ చేశాం. జైల్ ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్‌గా వుంటాయి.
నాకు డబుల్ బొనంజా…
గీతా ఆర్ట్ వారు యాక్టర్‌కి మంచి రిలీజ్ ఇస్తారు. వాళ్ళ ప్రోడక్ట్ బావుంటుంది. ఈ కథ గీతా ఆర్ట్ దగ్గర ఉండటం నాకు డబుల్ బొనంజా. -దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బుజ్జితల్లి పాట సినిమాని గ్రౌండ్ లెవెల్‌లోకి తీసుకెళ్ళిపోయింది. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దేవితో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా వుంటుంది. తనతో చేసిన ప్రతి సినిమా ఆడియో సూపర్ హిట్.
పల్లవితో కలిసి నటించడం ఇష్టం…
సాయి పల్లవి అద్భుతమైన నటి. పల్లవితో కలిసి నటించడం నాకు చాలా ఇష్టం. తనలో మంచి పాజిటివ్ ఎనర్జీ వుంటుంది. క్యారెక్టర్‌ని లోతుగా అర్ధం చేసుకుంటుంది. ఒక నటి అలా వున్నప్పుడు మన నటన కూడా మరింత బాగుంటుంది.
ట్రైలర్ నచ్చి వచ్చారు…
ఆమీర్ ఖాన్‌కి ట్రైలర్ చాలా నచ్చింది. శుక్రవారం వాళ్ళ అబ్బాయి సినిమా రిలీజ్ వున్నప్పటికీ ట్రైలర్ నచ్చి ఈవెంట్‌కి వచ్చారు. అలాగే కార్తి కూడా కంటెంట్ నచ్చే ఈవెంట్‌కి వచ్చారు.
అందుకే ఆ సాంగ్ ఆ థీమ్‌లో…
-సాయి పల్లవితో డ్యాన్స్ చేయాలంటే కష్టపడాలి(నవ్వుతూ). అయితే చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. శివుని సాంగ్ థీమ్ కూడా శివ పార్వతుల లవ్ స్టొరీ మీద వుంటుంది. మా క్యారెక్టర్స్ కూడా సినిమాలో శివ పార్వతుల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. అందుకే ఆ సాంగ్ ఆ థీమ్‌లో పెట్టారు.