Monday, December 23, 2024

మీ అభిమానానికి ఆనంద భాష్పాలొస్తున్నయ్

- Advertisement -
- Advertisement -
కార్యకర్తల త్యాగాలను వృథా పోనివ్వను.. గొల్లకొండపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్

హైదరాబాద్ : ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్ధమయ్యారని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ తొలిసారి హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా శుక్రవారం పార్టీ శ్రేణులు వేలాదిగా హాజరై శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి ర్యాలీగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్ కు వేములావాడ పూజారుల వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, రుణమాఫీ, పీఆర్సీ అమలు, వీఆర్‌ఏ, జేపీసీల రెగ్యులరైజేషన్ వంటి హామీలన్నీ కెసిఆర్ ఎన్నికల స్టంట్ లో భాగమేనన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమని తేలడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు ఈ డ్రామాలకు తెరదీశాడని దుయ్యబట్టారు.

సర్కార్ దగ్గర నయాపైసా లేదని, జీతాలు కూడా సరిగా ఇవ్వలేని కెసిఆర్ ఎన్నికల తాయిలాల కోసం విలువైన ప్రభుత్వ ఆస్తులను తెగనమ్ముతున్నారని మండిపడ్డారు. గడువు ముగియకముందే మద్యం టెండర్లను పిలిచి వేల కోట్లు పోగేసుకునే పనిలో పడ్డారని అన్నారు. తనకు పదవి ఉన్నా లేకపోయినా కార్యకర్తలు చూపుతున్న అభిమానాన్ని చూస్తుంటే ఆనంద భాష్పాలు వస్తున్నాయని భావోద్వేగానికి గురయ్యారు. బిజెపి గ్రాఫ్ తగ్గిందని, పార్టీలో గ్రూపు తగాదాలున్నాయంటూ జరుగుతున్న దుష్ప్రచారమేనన్నారు. పార్టీ గ్రాఫ్ తగ్గించేందుకు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ప్రచారం విజయవంతం కావొచ్చేమో తప్ప ప్రజలు మాత్రం బిజెపి పక్షానే ఉన్నారని చెప్పారు. కార్యకర్తల త్యాగాలను, పోరాటాలను వృథా చేయబోం. గొల్లకొండ కోటపై కాషాయ జెండాను రెపరెపలాడిస్తాం. ఎన్నికల యుద్దంలో ఉన్నాం. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయమిది. కార్యకర్తలతో పాటు ప్రజా సంగ్రామ సేనతో కలిసి బిజెపి చేసిన పోరాటాలు ప్రజల మదిలో పదిలంగా ఉన్నాయన్నారు.

ఈ సందర్భంగా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, గరికపాటి మోహన్ రావు, మాజీ ఎంపిలు చాడ సురేష్ రెడ్డి రవీంద్ర నాయక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, రాణి రుద్రమాదేవి, జె.సంగప్పతోపాటు వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, ఐటీసెల్ కన్వీనర్ తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు.

Bandi Sanjay 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News