న్యూఢిల్లీ : ఎఐసిసి అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో ఆదివారం భేటీ అయ్యారు. రానున్న ఎన్నికలతోపాటు పార్టీ భవిష్యత్తుపై చర్చించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి వీరిద్దరూ ప్రధాన పోటీదారులుగా భావిస్తున్నారు. ఈ సమావేశం దాదాపు అరగంట సేపు సాగింది. కాంగ్రెస్ అధ్యక్షపదవికి పోటీలో ముందున్నారన్న కథనాలు గత వారం రాగా వాటిని థరూర్ తోసిపుచ్చారు. అయితే పార్టీ పగ్గాలు మళ్లీ చేపట్టడానికి ఆఖరి క్షణం వరకు రాహుల్ గాంధీని ఒప్పించడానికి ప్రయత్నిస్తానన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాతనే పోటీ చేయడంపై నిర్ణయిస్తానన్నారు. రామ్‌లీలామైదాన్‌లో ఆదివారం జరిగిన కాంగ్రెస్ ర్యాలీకి ఈ నేత లిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా గెహ్లాట్ ప్రసంగిస్తూ బీజేపీలో నేతలు ఫాసిస్టులని, వారు కేవలం ప్రజాస్వామ్యం అనే మాస్క్ తొడుగుకున్నారని వ్యాఖ్యానించారు.
రాజ్యాంగం నాశనమైందని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, యుపిఎ పాలన సమయంలో మోడీ తాను చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు మరిచిపోయారని గెహ్లాట్ వ్యాఖ్యానించారు. గాంధీలపై ప్రజలకు నమ్మకం మీకన్నా (మోడీని ఉద్దేశిస్తూ) అపారంగా ఉందని, గాంధీ కుటుంబంలో ప్రధాని పదవితోసహా ఏ పదవిని ఎవరూ చేపట్టలేదని పేర్కొన్నారు. దేశంలో హింస, ద్వేష వాతావరణం వ్యాపించిందని, అందువల్ల ప్రజలంతా సమైక్యంగా ముందుకు నడవాలని, భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని గెహ్లాట్ ప్రసంగించారు. తరువాత థరూర్ రాహుల్ గొప్పగా ప్రసంగించారని ట్వీట్ చేశారు. సెప్టెంబర్ 22 తరువాత కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్ వెలువడుతుంది. సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 8 ఆఖరి గడువు. ఎన్నికలు అవసరమైతే అక్టోబర్ 17న జరుగుతాయి. అక్టోబర్ 19న ఫలితాలు వెలువడుతాయి.