Friday, December 20, 2024

నా కల నిజమైంది

- Advertisement -
- Advertisement -

‘పెళ్లి చూపులు’, ’ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ ’కీడా కోలా’తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇటీవలే విడుదలై సినిమాపై అంచనాలని పెంచింది. కీడా కోలా సినిమా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో దర్శకుడు తరుణ్ భాస్కర్

దాస్యం మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
ప్రతి క్రైమ్ దూరం నుంచి చూస్తే కామెడీనే…
లాక్‌డౌన్ సమయంలో చాలా మంది రకరకాలుగా వినూత్నంగా డబ్బులు సంపాదిస్తున్నారని తెలిసి నాకు చాలా కామెడీ గా అనిపించింది. రోడ్‌పై మ్యాన్ హోల్ కవర్ లేదు. ఎవడో ఇనపసామాన్లు వాడికి అమ్మేశాడట. ఇంకా సంపాయించడానికి మార్గాలు ఏమున్నాయని అడిగితే.. తినే పదార్ధాలలో పురుగు పడిందని కేసు వేసి కూడా సంపాదించవచ్చని ఫ్రెండ్స్ చెప్పారు. ఇలా చాలా ఆసక్తికరమైన చర్చ నడిచింది. అయితే ఇదంతా క్రైమ్. కానీ దూరం నుంచి చూస్తే కామెడీ. ప్రతి క్రైమ్ దూరం నుంచి చూస్తే కామెడీనే. ఇది నా ఫేవరేట్ జోనర్ కూడా. అక్కడ నుంచి కీడా కోలా మూవీ ఆలోచన వుంది.

క్రైమ్ కామెడీలే ఇష్టం…
నా ఆల్ టైం ఫేవరేట్ మూవీ మనీమనీ. అందులో బ్రహ్మానందం పాత్ర చాలా ఇష్టం. అలాగే జిగర్తండా, సుదుకవ్వం చిత్రాలు కూడా చాలా ఇష్టం. రొమాంటిక్ కామెడీలు నాకు బోరింగ్ సబ్జెక్ట్. నాతో పాటు నా ఫ్రెండ్స్‌కి కూడా క్రైమ్ కామెడీలే ఇష్టం. ఇప్పుడు ఈ సినిమాతో క్రైమ్ కామెడీ కల నిజమైంది.

పాత్రల విషయంలో భాద్యతగా ఉంటా…
గత రెండు సినిమాలతో పోల్చుకుంటే ఇందులో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాను. కీడాకోలా మూవీలో గన్స్ షాట్స్, బ్లాస్ట్స్… ఇలా చాలా వరకూ సినిమాటిక్ లిబర్టీ వుంటుంది. ఇక సినిమాల ప్రభావం సమాజంపై ఉంటుందనే చెప్పాలి. నా కథలు, పాత్రల విషయంలో భాద్యతగా ఉంటాను.

బ్రహ్మానందం పాత్రకు మా తాతయ్య స్ఫూర్తి…
ఈ సినిమాలో నటించిన బ్రహ్మానందం, రఘు నాకు ఆదర్శమైన నటులు. బ్రహ్మానందం పాత్రకు మా తాతయ్య స్ఫూర్తి. మా తాతయ్య నాకు మంచి ఫ్రెండ్. ఆయనది చాలా ఫన్ క్యారెక్టర్. ఆ పాత్రకు బ్రహ్మనందం అయితే బావుంటుదనిపించింది. ఆయన అద్భుతంగా చేశారు. ఇక జీవన్, విష్ణు.. ఇలా అందరిని ఆడిషన్స్ చేసే ఎంపిక చేశాం. ఇందులో మొత్తం ఎనిమిది పాత్రలు వున్నాయి. అందులో హీరో ఎవరనేది నేను మా రైటింగ్ టీం బెట్ వేసుకున్నాం. ఆడియన్స్ ఎవరిని హీరో అంటారో అని. ఇది చాలా ఆసక్తికరమైన గేమ్.

యూనిక్ రైటింగ్, మేకింగ్‌తో నవ్విస్తున్నాం…
ముంబైలో ప్రివ్యూ చూసినప్పుడు అందరూ ఎంజాయ్ చేశారు. సినిమా చూస్తున్నంతసేపు హాయిగా నవ్వుకున్నారు. యూనిక్ రైటింగ్, మేకింగ్ తో నవ్విస్తున్నాం. ఖచ్చితంగా ప్రేక్షకులు పైసా వసూల్ అని ఫీలవుతారనే నమ్మకం వుంది.

నెక్స్ ప్రాజెక్ట్…
వెంకటేష్‌తో ఒక సినిమా ఉంటుంది. సురేష్ బాబు వర్క్ చేయమన్నారు. అయితే కథ కోసం మరింత సమయం తీసుకున్నాను. ఇప్పుడు సిద్ధంగా వున్నాను. అలాగే ఒక వెబ్ సిరీస్‌కి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News