హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఆయన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించారు. ఎలాంటి పాత్రకి అయినా ప్రాణం పోసే సత్తా ఆయనలో ఉంది. పాజిటివ్ కానీ, నెగెటివ్ కానీ ఏ పాత్రలో అయిన ఆయన జీవిస్తారు. అయితే ఓ పాత్రకు మాత్రం చిరంజీవి సెట్ కారు అని దర్శకుడు తేల్చి చెప్పేశాడు.
సందీప్ కిషన్ హీరోగా, త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మజాకా’. ఈ సినిమాలో సందీప్ తండ్రి పాత్రలో రావు రమేష్ నటిస్తున్నారు. అయితే ముందుగా ఈ కథ సిద్ధు జొన్నలగడ్డ, చిరంజీవితో తీద్దామని అనుకున్నారట. దర్శకుడుగా సోగ్గాడే చిన్ని నాయన ఫేమ్ కళ్యాణ్ కృష్ణని తీసుకోవాలని భావించారట. కానీ, కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. అయితే చిరంజీవి ఈ సినిమా చేయకపోవడమే మంచిదని తెలుస్తోంది.
ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు త్రినాథ్ రావు తెలిపాడు. ‘చిరంజీవి దగ్గరకు ఈ సినిమా కథ వెళ్లిన మాట నిజమే కానీ, రావు రమేష్ ఇమేజ్‌కీ, ఆయన వయసుకీ తగ్గ పాత్ర ఇది. ఎంతైనా చిరు ఇమేజ్ వేరు కదా, ఆయన ముందు కథ చిన్నదైపోతుంది’ అని త్రినాథ్ రావు పేర్కొన్నారు. హీరో సందీప్ కూడా ఇలాగే చెప్పాడు. ఇక పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘మజాకా’లో రీతూ వర్మ, అన్షు అంబానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదల కానుంది.