ఎమ్మెల్యే టికెట్ రానందుకు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కన్నీటి పర్యంతమయ్యారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను సోమవారం ప్రకటించిన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాజయ్యకు షాకిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాజయ్యకు కాకుండా ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి సిఎం కెసిఆర్ టికెట్ కేటాయించారు. దీంతో రాజయ్య కన్నీరు పెట్టుకున్నారు. బిఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం రాజయ్య, స్టేషన్ ఘన్ పూర్ క్యాంపు కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు.
ఇప్పుడున్న పదవికంటే ఉన్నతస్థానం కల్పిస్తామని సిఎం కెసిఆర్ చెప్పారని రాజయ్య కార్యకర్తలకు తెలిపారు. అధినాయకుడి మాటను గౌరవించి ముందుకు సాగాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. సిఎం కెసిఆర్ గీసిన గీత దాటకుండా ఆదేశాలు పాటించాలని అన్నారు. డిసెంబర్ 11 వరకు తాను ఎమ్మెల్యేగానే ఉంటానని, నిరంతరం ప్రజల్లో ఉండటమే తనకు ఇష్టమని ఆయన చెప్పారు.