తెలంగాణ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపిన శాట్స్ ఛైర్మన్ ఆంజనేయ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : నేటి నుండి ఛైనాలోని హౌంగ్‌జౌ నగరంలో 19వ ఏసియన్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి. దాదాపు 40కి పైగా దేశాలు పాల్గొంటున్న ఈ పోటీలలో 41 క్రీడాంశాల్లో 655 మంది మన దేశ క్రీడాకారులు పాల్గోనబోతున్నారు. సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు జరిగే ఈ పోటీల్లో తెలంగాణ నుండి మొత్తం 16 మంది అథ్లెట్స్ పాల్గొంటుండగా వీరిలో 11 మంది అమ్మాయిలే ఉండడం విశేషం. ఇది తెలంగాణ మహిళా శక్తికి నిదర్శనం కూడా.
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం , రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ( శాట్స్ ) గత దశాబ్ది కాలం నుండి “ దీర్ఘకాలిక వ్వూహం.. స్వల్పకాలిక లక్షాలు ” అన్న సూత్రాన్ని అనుసరించి జాతీయ అంతర్జాతీయ పోటీలలో తెలంగాణ క్రీడాకారులకు గణనీయమైన ప్రాతినిధ్యం దక్కుతోంది. ఈ పోటీలలో పాల్గొంటున్న భారత క్రీడాకారులందరూ పతకాలతో తిరిగి రావాలని తెలంగాణ రాష్ట్రం ఆశిస్తోంది. మన క్రీడాకారులు అద్బుత ప్రదర్శనలతో మన తెలంగాణకు, అటుదేశానికి పేరు తీసుకురావాలన్నదే సిఎం కెసిఆర్ అభిమతం కూడా. కాగా నేటి నుండి ప్రారంభం కానున్న ఏసియన్ గేమ్స్‌లో పాల్గొంటున్న మన దేశ క్రీడాకారులకు , అదే విధంగా తెలంగాణ రాష్ట్ర క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ( శాట్స్ ) ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు రూ. 5 కోట్లు బాక్సర్ నికత్ జరీన్‌కు 2.5 కోట్లు, సానియా మిర్జా, పుల్లెల గోపీచంద్ లాంటి వారికి కోటి.. ఇలా ఎందరో క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం శాట్స్ సంస్థ ద్వారా నగదు ప్రొత్సహకాలను అందించిందని వీరిని స్పూర్తిగా తీసుకుని చైనాలో 19వ ఏషియన్ గేమ్స్ క్రీడల్లో మొత్తం ఇండియన్ టీమ్ పతకాలతో తిరిగి రావాలని ఆశిస్తున్నామని ఛైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రతిభను ఏయిషన్ గేమ్స్‌ను చూపించి తెలంగాణకు తద్వారా భారతదేశానికి మంచి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మన క్రీడాకారులను కోరుతున్నట్లు తెలిపారు.