Wednesday, January 22, 2025

4వ వేవ్ రాకపోవచ్చు

- Advertisement -
- Advertisement -

The 4th wave may not come:Dr Srinivas rao

రాష్ట్రంలో అదుపులోనే కరోనా.. అయినా జాగ్రత్తలు పాటించాలి

అర్హులైన వారందరూ బూస్టర్ డోస్
వేసుకోవాలి ప్రతి ఒక్కరూ
టీకాలు వేయించుకోవాలి
శుభకార్యాలు, విహారయాత్రల
నేపథ్యంలో 3నెలల పాటు
జాగ్రత్తలు తీసుకోవాలి
ప్రజలంతా మాస్కులు ధరిలంచాలి
12ఏళ్లు పైబడిన పిల్లలందరికీ
వ్యాక్సిన్ ఇప్పించాలి కొన్ని
రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి:
రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు
డా. శ్రీనివాస రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా అదుపులోనే ఉన్నా.. అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాల్సిందేనని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. గురువారం కోఠిలోని కార్యాలయంలో డిహెచ్ మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్రంలో ఆ పరిస్థితి రావొద్దు అంటే ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. అర్హులైన ప్రతీ ఒక్కరూ బుస్టర్ డోస్ వ్యాక్సిన్, 12 ఏళ్లు పైబడిన పిల్లలందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని కోరారు. నిర్లక్ష్యం వహించకుండా ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని డీహెచ్ సూచించారు. ఆరు వారాలుగా కరోనా వైరస్ అదుపులోనే ఉందని, రోజూ 20 నుంచి 25 మధ్య కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. తెలంగాణలో నాలుగో వేవ్ రాకపోవచ్చని అన్నారు. కొవిడ్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రభుత్వం కరోనా పరిస్థితులను నిశితంగా గమనిస్తోందని పేర్కొన్నారు.

కొవిడ్ వ్యాప్తి పూర్తిగా పోలేదని .. రానున్న మూడు నెలల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ అన్నారు.దేశంలో ఆర్ వ్యాల్యూ అనేది పూర్తిగా కంట్రోల్‌లోనే ఉందని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో 1 శాతం కంటే ఎక్కువగా ఉందని, తెలంగాణ రాష్ట్రంలో 0.5 మాత్రమే ఉందని తెలిపారు. ఫోర్త్ వేవ్ రాబోదని ఎన్‌ఐఎం సీరో సర్వేలాంటివి చెప్తున్నాయని అన్నారు. 93 శాతం ప్రజల్లో కొవిడ్ యాంటీబాడీలు ఉన్నట్లు సీరో సర్వేల్లో వెల్లడైందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని అన్నారు. అయితే పక్క రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు స్వీయజాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పారు. గత నాలుగు రోజులుగా సిఎం కొవిడ్ వివరాలు తెలుసుకుంటున్నారని అన్నారు.

కొన్నిచోట్ల నాలుగో వేవ్ ప్రారంభం

కొన్ని చోట్లా నాలుగో వేవ్ ప్రారంభమైందని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. కరోనా పూర్తిగా నిర్మూలన కాలేదని.. చైనా, తైవాన్, ఈజిప్టులో కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. మనదేశంలోని ఢిల్లీ, హరియాణా, యుపి రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ఢిల్లీలో పాజిటివిటి రేటు 4 శాతానికి చేరిందని.. తెలంగాణలో పాజిటివిటి రేటు పెరగలేదని స్పష్టం చేశారు.హైదరాబాద్ మినహా మరెక్కడా 10కి పైగా కేసులు నమోదు కావడం లేదని తెలిపారు. గత ఆరు వారాలుగా రాష్ట్రంలో కొవిడ్ అదుపులో వుందని డీహెచ్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ప్రజల అప్రమత్తత కారణంగా థర్డ్ వేవ్ తక్కున నష్టంతో బయటపడ్డామని తెలిపారు. ఇప్పటికే తెలంగాణలో 106 శాతం జనాభాకు మొదటి డోసు ఇచ్చామని, రెండో డోసు కూడా వంద శాతం మంది వేసుకున్నారని అన్నారు.

ఎక్స్‌ఈ వేరియంట్ ప్రభావం చూపకపోవచ్చు

ప్రజల సహకారంతో రెండు దశల్లోనూ కరోనాను సమర్ధంగా నియంత్రించగలిగామని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఎక్స్ ఈ వేరియంట్ ఎక్కువ ప్రభావం చూపకపోవచ్చని అన్నారు. 2022 డిసెంబర్ నాటికి కొవిడ్ పూర్తిగా ఫ్లూ లాగా మారే అవకాశముందని డీహెచ్ అంచనా వేశారు. రాష్ట్రంలో ఎలాంటి నిబంధనలు అవసరం లేదని డీహెచ్ స్పష్టం చేశారు. రాబోయే 4 నుంచి 6 వారాల తర్వాత కరోనా కేసులు పెరిగే అవకాశముందని తెలిపారు.

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం

మూడో వేవ్ నుంచి మనం ఇప్పుడిపుడే కోలుకుంటున్నామని డీహెచ్ తెలిపారు. తెలంగాణలో నాలుగో వేవ్ రాకపోవచ్చని ధీమా వ్యక్తం చేశారు. సీఎం కరోనా వ్యాప్తిపై ఎప్పటికప్పుడు వివరాలు తీసుకుంటున్నారని వెల్లడించారు. జూన్ వరకు పెళ్లిళ్లు, విహారయత్రాలు ఎక్కువగా ఉన్నందున వచ్చే మూడు నెలలు ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలు ప్రజలందరూ పాటించాలని సూచించారు. ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని, ఫంక్షన్‌లు, ప్రయాణాల్లో ప్రజలందరూ మాస్క్‌లు ధరించడంతోపాటు శానిటైజర్లు వాడాలని సూచించారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సినేషన్ గణనీయంగా సాగుతోందని తెలిపారు. ఎన్‌ఐఎన్ సీరో సర్వేలో సెరో పాజిటివిటీ 92.9 శాతంగా ఉందని వెల్లడించారు. హైదరాబాద్‌లో సెరో పాజిటివిటీ 95 శాతంగా ఉన్నట్లు డీహెచ్ వివరించారు. ఆరోగ్య కార్యకర్తల్లో 92.8 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

మ.12 నుంచి సా. 4 వరకు బయటకు రావద్దు

రాష్ట్రంలో ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయని, అవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు బయటకు రావద్దని డీహెచ్ సూచించారు. ప్రజలు లేత రంగు దుస్తులు, కాటన్ వస్త్రాలు ధరించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 2.5 లీటర్ల నుంచి 4 లీటర్ల నీరు తాగాలని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, స్లైన్లు అందుబాటులో ఉంచామని డీహెచ్ శ్రీనివాసరావు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News