Monday, December 23, 2024

కష్టజీవి కన్నీటి చిరునామా…

- Advertisement -
- Advertisement -

సాహిత్య ప్రక్రియలలో కథలు, వ్యాసాలు మరియు నవలలకు ప్రత్యేక స్థానం ఉంది. వివరంగా చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని కూలంకషంగా విశ్లేషించడం నవలల ద్వారానే సాధ్యమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం నీ తప్పు అన్నఅబ్దుల్ కలాం మాట అక్షర సత్యం. సమస్యలను సాకుగా చూపుతూ విజయం సాధించలేకపోయామని వాపోయే చాలా మంది యువత మనకు నిజ జీవితంలో తారసపడుతుంటారు. మరి కొందరు మాత్రం తమ తల్లిదండ్రుల మాటలను ఆదర్శంగా తీసుకుని ఎన్ని ఆటంకాలు, అవమానాలు ఎదురైనా అనుకున్న లక్ష్యాలను సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. లక్ష్యం ముందు లక్ష సవాళ్లనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నవారే లక్ష్యాన్ని సాధిస్తారనేది జగమెరిగిన సత్యం.

నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఎంతో మంది విద్యార్థులు తమకంటూ ఓ ఆశయం పెట్టుకుని సమాజంలో ఎదురైన అవమానాలను అవకాశాలుగా మలచుకొని ఉన్నత ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. అయితే వారిలో కొందరు తమ లక్ష్యసాధనలో ఎదుర్కొన్న ఆటుపోట్లను భావి తరాలకు లేదా ప్రస్తుత యువతకు ఎలాంటి సందేశాన్ని అందించలేకపోతున్నారు. కాగా మరి కొందరు తమ స్వీయానుభావాలను రచనలు, నవలల రూపంలో నేటి యువతకు స్ఫూర్తిగా అందిస్తున్నారు. కొందరు రచయితలు ఇప్పటివరకు అనేక అంశాలపై నవలలు వెలువరించినా యువతను ఉత్తేజపరిచే అంశాలతో వెలువడిన నవలలు చాలా తక్కువే. ఈ నేపథ్యంలోనే భారత డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్) చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ‘డాక్టర్ వెన్నం ఉపేందర్ (IPoS)‘ కలం నుండి జాలువారింది యువతకు స్ఫూర్తి దాయకమైన నవల ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు‘.
రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద చేనేత కుటుంబానికి చెందిన వెన్నం ఉపేందర్ గారి స్వగ్రామం సూర్యాపేట జిల్లా, మద్దిరాల మండలం లోని మారుమూల పల్లె గుమ్మడవెళ్లి. ఆయన జీవితంలో తినడానికి తిండి లేక పస్తులున్న సందర్భాలెన్నో. కాలే కడుపుకి కాసిన్ని నీళ్లు, సలిపించే గాయానికి కాసింత పశుమూత్ర పూత అన్నట్లుగా ఆయన ఆకలి ఆర్తనాదానికి కాసిన్ని నీళ్ళే ఊరట, పేదోడికి గాయాలైతే గాయం నొప్పి కన్నా పైసల కోసం తండ్లాడె నొప్పి ఎక్కువ. పైసలు లేక పశు మూత్రం తో గాయంపై రాసుకుని ఉపశమనం పొందిన జీవితం ఆయనది. అలా ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఆశయం కోసం ఆకలిని అదిమిపెట్టి, ఆశయమనే నిచ్చెన మెట్లు ఎక్కి తీరాలనే అకుంఠిత దీక్షతో పుస్తకాల పురుగయిండు. పేద జీవితం గట్టెక్కాలంటే చదువే మార్గమని భావించాడు. ఉపేందర్ చూపు చదువుపైనా, ఆకలి అటకపైనా సాగిన ఆయన జీవన ప్రస్థానం ఇతివృత్తంగా అక్షరీకరించిన నవల ఈ ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు‘.

సాధారణంగా కొన్ని నవలల్లోఒకే అంశాన్ని విశ్లేషించి రాస్తారు. కానీ వెన్నం ఉపేందర్ నవలలు మాత్రం భిన్నంగా ఉంటాయి. పాఠకులకు కృతజ్ఞతా భావాన్ని కలిగించేలా మరియు వారి హృదయాలను కదిలించేలా చాలా అంశాలు అద్భుతంగా వివరించబడ్డాయి. ఈ నవలలోని ఇతివృత్తాలు అక్షరీకరించబడిన జీవితం, అనాథల జీవనం – చితికిన పసితనం, హైస్కూల్ చదువులు – ఆమ్లపు చినుకుల స్పర్శలు, సినిమా చూద్దామా – అయ్యో శని మామా, మా ఊరు మా ఇల్లు – ఎప్పటికి ఒడవని ముచ్చట. తెగి అతికిన ఇంటర్-కంట అలుగు పోసిన కన్నీరు, కలలతో ములాకాతు, రంగులు వెలిసిపోయిన ఓ తాత కల, కుండ పలిగిన కల, చెదిరిన పెళ్లి పల్లకి కల, చచ్చి మర్లబతికిన కల, మా నాయన ఖాలినపడ్డ కల, తెలిగిపోతున్న తల్లివేర్ల కల, మా జీవితాలే అప్పు పడ్డయి, ఆయన వెలువరించిన ‘అక్షరీకరించబడిన జీవితం‘ ఇతివృత్తం ద్వారా గ్రామీణ యువతకు అమూల్యమైన సందేశాన్ని అందించారు. గ్రామీణ యువత ఎదగాలంటే, ఒదిగి చదువుకోవాలని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా చదువును నిర్లక్ష్యం చేయొద్దని, ‘నీ వల్ల గాదన్న నిచ్చెన మెట్లు ఎక్కి తీరాలి. ఆకలి భౌతికం – ఆవేదన మానసికం‘ అని ఈ నవలలోని నేపథ్యం పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా అమ్మతనంలో ఉన్న కమ్మతనాన్ని ఒక కవిగా వర్ణించిన తీరు అత్యద్భుతం. అమ్మతనం ఆగి పోవద్దు – భార్య అని మనం అనుకుంటాం కానీ. భార్య అమ్మ రూపంలో అమ్మే భార్య (స్వప్న) అని పాఠకుల హృదయాలను కదిలించారు.

‘హైస్కూల్ చదువులు – ఆమ్లపు చినుకుల స్పర్శలు‘ ఇతివృత్తాన్ని పరిశీలించగా ఆయన స్వగ్రామంలో 8 వ తరగతి లేకపోవడంతో చదువు కోసం కాలినడకన రోజుకు 16 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చదువును కొనసాగించిన తీరు పాఠకుల హృదయాలను ద్రవింపచేస్తుంది. ఆ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తుచేసుకుంటూ పాఠకులకు తన బాల్య స్మృతులను పరిచయం చేస్తూ అక్షరీకరించారు. ఆయనది చెప్పులు కొనలేని పరిస్థితి, ఎవరికి చెప్పుకోలేని దుస్థితి. ఆయన నడక ప్రయాణంలో కాలికి కసితీరా గుచ్చుకున్న తుమ్మ ముండ్లు , అపుడప్పుడు బాటకు అడ్డంగా ఎదురయ్యే తాసుపాములు, రోజుకోసారి వచ్చిపోయే ఎర్రబస్సు లను చూస్తూ సాగిన హైస్కూల్ సదువు ఆమ్లపు చినుకుల సుఖాన్ని తెలియజేసినట్లుగా పేర్కొన్నారు. పూట గడవని పరిస్థితి వారిది. 8 వ తరగతిలో చేరిన కొన్ని నెలలకే హాస్టల్ సీట్ వచ్చినప్పటికీ గొడ్ల కొట్టంతో కూడిన హాస్టల్ లో సాయంకాలమైతే పక్కనే పశువుల మంద, హాస్టల్ చుట్టూ దోమలు స్త్వ్రరవిహారం చేస్తుండేవి. ప్రతిరోజు పచ్చిపులుసు, వంకాయ, గోంగూర కూరలు. సుఖమెరగని హాస్టల్ జీవితం. హాస్టల్ లో పురుగులు పడిన అన్నం తిని తిని నెలకోసారి జ్వరం.

హాస్టల్ కి నాయన తెచ్చిన పుస్తకాన్ని అతిమధురమైన జ్ఞాపకంగా గుర్తించుకోవడం గొప్ప విషయం. ఒకరోజు వాళ్ళ నాన్న రెండు కోరికలు కోరిండు. ఒకటి ఆకాశంలో ఎగురుతున్న విమానాన్ని చూపిస్తూ ‘నువ్వు ఇలాంటి గాలిమోటార్లల్ల తిరగాలి అది నా కల. రెండోది నువ్వు ఇంగ్లీష్ లో గల గల మాట్లాడుతుంటే చూడాలనుందని. నాయనంటే ఏడాదికోమారు వికసించే జ్ఞాపకం. నాయనంటే అనుభవాల అక్షయపాత్ర. నాయనున్నపుడు జుర్రుకోవాలన్న సోయి లేదు – జారిపోయాక జాడ లేదు అని చమత్కారమైన సూక్తులతో పాఠకుడిని కంటతడి పెట్టించే విధంగా తన హృదయాంతరాలలో గూడుకట్టుకున్న భావాలకు జీవం పోశారు. నాయన బతికుండగా నా చదువు నాయనకు అన్నం పెట్టడానికి పనికి రాలేదు కానీ అప్పు పత్రాలు రాయడానికి మాత్రం పనికొచ్చిందని తన బాధను వ్యక్తం చేశారు.

ఈ ప్రపంచంలో అమ్మ కష్టం ముందు ఏది సరితూగదు అనే విషయాన్ని తన అమ్మ పడిన కష్టాన్ని ‘కలలతో ములాకాతు‘ లో ఎంతో వివరంగా విశ్లేషించారు. ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగకు అందరిలాగే తన అమ్మ కూడా గునుగు పూలు, బంతి పూలతో బతుకమ్మ పేర్చడం చూసేది కానీ చెరువు దగ్గరకు బతుకమ్మ ఆడేందుకు వెళ్లడం ఎప్పుడూ చూడలేదు. పేర్చిన బతుకమ్మ ఇంటి పక్కన వారికి ఎవరికో ఇచ్చేది ఒక రోజు అమ్మను అడిగాడు ‘అమ్మ నువ్వు ఎందుకు బతుకమ్మ పట్టుకొని చెరువు దగ్గరకు రావు అని అడగగా అడగగా ఓ రోజు అమ్మ చెప్పిన సమాధానం ‘బోసి మెడ, కాళ్లకు మెట్టెలు లేవు యెట్లా రాను కొడుకా‘ అది విన్న కొడుకు కళ్ళలో మత్తడి దూకిన కోపుల నీళ్లు లాగా కళ్లలో నీళ్లు దునికినాయి. లోకమంతా సదువు బందు చేసి, నాలుగు రూపాయలు వచ్చే పని చేయమన్నప్పుడు అమ్మ ఒక్కతే నువ్వు చదువుకోవాలి బిడ్డ, నువ్వు సదివి సదివి పెద్ద కొలువులు జెయ్యాలి నీ కష్టాలు నష్టాలు నేను చూసుకుంటా బిడ్డ అని అమ్మ చెప్పిన మాటలను అక్షరీకరించి పాఠకులను ఉద్వేగానికి గురి చేశారు.

కష్టపడని తనముంటే కష్టాలను నిందించకు! కలం రాయలేకుంటే కాగితాన్ని నిందించకు! ఈ సృష్టిలో ప్రతి మనిషికి ఆటంకాలు ఎదురవడం సహజమే కానీ, ఆశయం దిశగా అడుగులు వేస్తూ, అడ్డంకులను అవకాశాలుగా మార్చుకున్నప్పుడే విజయం మీ వద్ధకు చేరుతుందనేది అక్షర సత్యం. చదవాలనే కోరిక బలంగా ఉండి, చదవడానికి డబ్బు లేని నిరుపేద యువతకు ఈ ‘మత్తడి దునికిన కోపుల నీళ్లు‘ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందడంలో ఎలాంటి సంశయం లేదు. వెన్నం ఉపేందర్ రచనలు కర్రు పుట్టింది, నారుమడి, నివేదనగా కవిత్వం, నెమలిక బరువు, ఎండమావి, కొన్ని వెలుగు నీడలు, మహాత్మాగాంధీ మంచి మాటలు ప్రతి రచనలో కూడా పాఠకుడిని ఆకర్షించే నవరసాలు చొప్పించడం వెన్నం ఉపేందర్ రచన నైపుణ్యానికి కలికితురాయిగా నిలుస్తుంది. వాస్తవిక ఘటనలను కథావస్తువుగా ఎంచుకుని తనలోని భావాలను కథలోని పాత్రల ద్వారా పాఠకుల గుండెల్లో గుచ్చుకునేలా చెప్పిన తీరును అభినందించడానికి మాటలు సరిపోవు అనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. నేటి యువతకు ఉపయోగపడే మరిన్ని నవలలు వెన్నం ఉపేందర్ కలం నుండి జాలువారాలని ఒక పాఠకుడిగా నా ప్రగాఢ ఆకాంక్ష.

-కోట దామోదర్
9391480475

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News