Monday, December 23, 2024

నిరుపేద వర్గాలకు అత్యాధునిక వైద్యం అందించడమే సర్కారు లక్షం

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : పేద వర్గాలకు మరింత నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలు అందించే తెలంగాణ సర్కారు అత్యాధునిక మైన వైద్య పరీక్షలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు వివరించారు. ఈ మేరకు రాష్ట్రంలోని పేద ప్రజలకు కార్పోరేట్ స్థాయిలో మెరుగైన ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు వీలుగా శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా 59 రకాల వైద్య పరీక్షలను జిల్లా ఆస్పత్రుల్లో 134 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో టీ. డయాగ్నోస్టిక్స్‌లో పెథాలజీ పరీక్షలకు సంసబందించి పెథాలజీ మిషన్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు మాట్లాడారు. ఈ రోజు డాక్టర్స్ డే పురస్కరించుకుని వైద్యులందరికీ శుభాకాంక్షలు వెలిబుచ్చారు.

ఈ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ఆరంభించుకుంటున్నామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని టి. డయాగ్నోస్టిక్స్ కేంద్రాల్లో పాథాలజీ, రేడియాలజీ ల్యాబ్‌లలో గతంలో ఉన్న 59 రకాల పరీక్షలకు అదనంగా 75 రకాల పరీక్షలను కలిపి మొత్తంగా 134 రకాల పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు వైద్యులు చూసిన మీదటే వారు రాసే వైద్య పరీక్షల టెస్టుల రిపోర్టులు 24 గంటలలోనే అందించడం జరుగుతుందన్నారు. ఆయా రిపోర్టుల ఆధారంగా వైద్యులు మెరుగైన వైద్యాన్ని రోగులకు అందించే అవకాశం కలుగుతుందన్నారు. వాటిల్లో ఎనిమియో ప్రొఫైల్, సర్జికల్ ప్రొఫైల్, క్యాన్సర్‌కి సంబందించి బయాప్సీ టెస్టులు, హార్మోన్ టెస్టులు, హెచ్‌ఐవి, వైరల్ గ్రూప్, యూరిన్ కల్చర్ తదితర 134 టెస్టులు అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి వివరించారు.

ఆయా టెస్టులు బయట ల్యాబుల్లో అయితే రూ. వెయ్యి నుంచి పది వేల వరకు ఖర్చు అవుతుందని కానీ టీ. డయాగ్నోస్టిక్స్ ద్వారా ఉచితంగానే ప్రభుత్వం నిర్వహిస్తుందని వెల్లడించారు. హైదరాబాద్‌లో ఏ తరహా వైద్యం సదుపాయాలు ఉంటాయో మారుమూల రిమోట్ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశ్యమని పేర్కోన్నారు. పేద ప్రజలకు మేలు కలుగజేసేందుకే సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని మెరుగుపర్చేందుకు అనేక సహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని వివరించారు. ఇంతకుముందు ఖర్చులకు బయపడి వ్యాది నిర్ధారణ పరీక్షలు చేయించుకోకుండా ఉండేవారని, దానివల్ల వ్యాధి ముదిరిపోయి ప్రాణాంతకంగా మారేదని ఇప్పుడు అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రభుత్వ వైద్యాన్ని మరింతగా మెరుగుపర్చామని పేర్కోన్నారు.

ఇప్పటివరకు టి. డయాగ్నోస్టిక్స్ కేంద్రాల ద్వారా 57 లక్షల మందికి వైద్య పరీక్షలు అందించడం జరిగిందని 10.40 కోట్ల పరీక్షలను చేసినట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి కూడా రావాల్సిన అవసరం లేదని ప్రతి పీహెచ్‌సీ, బస్తీ దవాఖాన నుంచి శాంపిల్స్‌సేకరించి వాటిని మొబిలైజేషన్ ద్వారా హెడ్ క్వార్టర్‌లోని టి.డయాగ్నోస్టిక్స్ ద్వారా పరీక్షలు నిర్వహించి డాక్టర్లు, పేషెంట్లకు గంటల వ్యవధిలోనే సెల్ ద్వారా సమాఛారం చేర్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆ రిపోర్టుల ఆధారంగానే పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించవచ్చన్నారు.

  • గిరిజనులకు అధికంగా ప్రయోజనం

పూర్తిగా గిరిజనులు అధికంగా ఉన్న మహబూబాబాద్ జిల్లాలో గిరి పుత్రులకు అత్యధికంగా ఉచిత వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చి వారికి మరింత మేలు జరుగుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అదనంగా అందుబాటులోకి తీసుకువచ్చిన 134 రకాల వైద్య పరీక్షల పాథాలజీ మిషన్‌ను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సత్యవతి మాట్లాడారు. గిరిజనులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో పూర్తిగా వెనుకబాటుకు గురైన గిరిజనులకు ఈ ఉచిత పరీక్షలతో పాటు నాణ్యమైన ప్రభుత్వ వైద్యం మరింతగా దోహదపడుతుందన్నారు. ఇక్కడి ఆస్పత్రిలో మునుపటి కంటే కూడా స్పెషాలిటీ వైద్యులు అందుబాటులోకి వచ్చారన్నారు. సీఎం కేసీఆర్ చొరవతో మానుకోటలో నూతనంగా మెడికల్, నర్సింగ్ కళాశాలలు అందుబాటులోకి వచ్చిందన్నారు.

అప్పటికి ఇప్పటికి వైద్య పరంగా జిల్లా ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి వైద్య సేవలను అందిస్తున్నారని వివరించారు. టి.డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రజలకు మరిన్ని వైద్య పరీక్షలను చేయడం, తద్వారా ప్రజలకు విలువైన నాణ్యమైన వైద్యాన్ని పేదలకు అందుబాటులోకి వచ్చినట్లైందన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలను మరిన్ని అందుబాటులోకి తేవడం అదృష్టంగా భావిస్తున్నామని మంత్రి సత్యవతి పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, జిల్లా పరిషత్ చైర్మైన్ కుమారి అంగోతు బిందు, మున్సిపల్ చైర్మైన్ డాక్టర్ పాల్వాయి రాంమోహన్‌రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ హరీశ్ రాజ్, సూపరింటెండ్ డాక్టర్ భూక్య వెంకట్రాములు, వైద్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News