Friday, November 22, 2024

అమర్‌నాథ్ యాత్ర ఆరంభం

- Advertisement -
- Advertisement -

The Amarnath Yatra started on Wednesday

రెండేళ్ల విరామానంతరం
జెకె గవర్నర్ సిన్హా శ్రీకారం
కట్టుదిట్టమైన భద్రతా ఇతర ఏర్పాట్లు

జమ్మూ : శివ హైందవభక్తులకు అత్యంత ప్రియమైన అమర్‌నాథ్ యాత్ర బుధవారం ఆరంభం అయింది. భక్తులు, వారిని సాగనంపేందుకు వచ్చిన వేలాది మంది హర హర మహాదేవ్ అంటూ ఉచ్ఛరిస్తూ ఉండగా జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా అమర్‌నాథ్ యాత్ర తొలి బృందానికి జమ్మూ బేస్‌క్యాంప్ వద్ద పచ్చజెండా చూపి యాత్రను ఆరంభించారు. భక్తులకు వీడ్కోలు పలికారు. ఈ బేస్‌క్యాంప్ నుంచే అత్యంత క్లిష్టమైన యాత్ర ఆరంభం అవుతుంది. యాత్రికులకు శాంతియుత,క్షేమ, ఆధ్యాత్మిక పయనం సిద్ధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. కొవిడ్, లాక్‌డౌన్ల తరువాత రెండేళ్ల పాటు నిలిచిపోయి ఇప్పుడు అమర్‌నాథ్ యాత్ర ఈ నెల 30న ఆరంభం అవుతోంది. బేస్‌క్యాంప్ వద్ద భక్తుల కోలాహలం నడుమ లాంఛనంగా బుధవారం సాయంత్రం గవర్నర్ ఈ యాత్రకు శ్రీకారం పలికారు. బాబా బోలేనాథ్‌గా ఇక్కడి శివుడిని పిలుచుకుంటారు. రెండేళ్ల పాటు బాబా దర్శనం కోసం ఎదురుచూస్తున్నామని ఇప్పుడు తమ కోరిక తీరుతోందని అక్కడికి వచ్చిన భక్తుడు ఒకరు తెలిపారు. హిమాలయ శ్రేణువులలో సముద్ర మట్టానికి 3880 మీటర్ల ఎత్తున కొండగుహలలో అమరనాథ్ శివలింగం నెలవై ఉందిం. ఈ ప్రాంతానికి ఫల్గామ్ , బల్టాల్‌ల నుంచి రెండు వేర్వేరు దారులు ఉన్నాయి.

2020, 2021 సంవత్సరాలలో కొవిడ్ ఉధృతి దశలో అమర్‌నాథ్ యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. సంబంధిత అమర్‌నాథ్ జీ క్షేత్ర పాలకమండలి సభ్యులతో చర్చించిన తరువాత రద్దు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు కొవిడ్ అదుపులోకి వచ్చి, జనజీవితం సాధారణం అవుతోన్న దశలో తిరిగి అమర్‌నాథ్ యాత్ర ఆరంభం అయింది. నష్కీ నుంచి బన్హిలాల్ వరకూ 66 కిలోమీటర్ల పొడవునా అమర్‌నాథ్ యాత్రికులకు ఉచిత భోజన ప్రసాదం, మంచినీరు ఇతర సౌకర్యాలు కల్పించారు. రామ్‌బన్ జిల్లా అధికార యంత్రాంగం స్పందించి అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మరో వైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విస్తృతమైన రీతిలో సాయుధ బలగాలతో ఏర్పాట్లు చేశారు. యాత్రికులకు వసతి, వైద్య ఆరోగ్య చికిత్సలు, సమాచార వినిమయం, పారిశుద్ధ ఏర్పాట్లు చేపట్టినట్లు అమర్‌నాథ్ క్షేత్ర పాలక మండలి ముఖ్య కార్యనిర్వాహణాధికారి నితిశ్వర్ కుమార్ విలేకరులకు తెలిపారు. పలుచోట్ల ఆహార ఏర్పాట్లకు లంగర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఉచిత ఫలాహారాలు, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఏర్పాట్లు ఉంటాయి. రాత్రి పూట పడుకునేందుకు బెడ్స్ , వైద్య సాయం వంటివి ఇతర అత్యవసర ఏర్పాట్లు చేశారని పాలకమండలి తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News