కాంగ్రెస్‌లో షర్మిల చేరడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
మన తెలంగాణ / హైదరాబాద్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో తన పార్టీని ఈ మేరకు విలీనం చేశారు. ఆమెకు ఏపి బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగనన్న వదిలిన బాణం… ఇప్పుడు రివర్స్‌లో తిరుగుతోందని అన్నారు. తెలంగాణ మాదిరి ఏపీలో కూడా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు లేకపోలేదని చెప్పారు. కాంగ్రెస్ ప్రభావం వైసిపి పై పడుతుందని అన్నారు.
చెల్లి నిర్ణయంతో వైఎస్ జగన్ సిఎం సీటుకే ఎసరు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తల్లి, చెల్లి వ్యవహారాన్ని వైఎస్ జగనే చూసుకోవాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ తాజాగా ఏపిలో జయహో బిసి కార్యక్రమాన్ని తీసుకువచ్చింది. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో ‘జయహో బిసి’ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ టిడిపి పాలనలో బిసిలకు ఎంత మేలు జరిగిందో, వైసిపి పాలనలో బిసిలు ఏం కోల్పోయారో ‘జయహో బిసి సదస్సు’ ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. జయహో బిసి కోసం 40 రోజుల కార్యాచరణ రూపొందించామని… జయహో బిసి లక్ష్యాలను పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళిక రచించామని చంద్రబాబు వివరించారు.