Monday, January 20, 2025

కుంటలో పడిన ఆటో.. ఊపిరాడక డ్రైవర్ మృతి

- Advertisement -
- Advertisement -

పెద్దేముల్: నీటి కుంటలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పెద్దేముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం… మండల పరిధిలోని గాజీపూర్ గ్రామానికి చెందిన బుడ్డ శ్రీనివాస్(36) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. నిత్యం ఆటో నడుపుతూ.. వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. అయితే ఎప్పటి వలే శ్రీనివాస్ ఆదివారం ఉదయం ఆటో తీసుకొని బయటికి వెళ్ళాడు.

చీకటి పడినప్పటికీ శ్రీనివాస్ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు వెతక సాగారు. ఈ క్రమంలో కందనెల్లి గ్రామ శివారులోని అంతిరెడ్డికుంటలో ఆటోతో సహా నీటిలో పడి తేలియాడుతూ కనిపించాడు. గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులు, కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ విద్యాచరణ్ రెడ్డి, కందనెల్లి, గాజీపూర్ గ్రామాల సర్పంచులు వీరప్ప, మోహన్ రెడ్డిలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీయించారు. మృతుడు శ్రీనివాస్ కందనెల్లి నుంచి కందనెల్లి తండా మీదుగా గాజీపూర్ వస్తుండగా మార్గమధ్యలోని అంతిరెడ్డికుంట కట్టపై ఆటో అదుపుతప్పి కుంటలో పడింది.

శ్రీనివాస్ ఆటోతో సహా నీటిలో పడటంతో.. ఆటో కిందనే ఇరుక్కుపోయి ఊపిరాడక మృతి చెందినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇదిలావుంటే మృతుడు బుడ్డ శ్రీనివాస్ గత కొన్నేళ్ల క్రితం కందనెల్లి తండాకు చెందిన శోభను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మృతుడు శ్రీనివాస్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. శ్రీనివాస్ మృతిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. శ్రీనివాస్ మృతితో గాజీపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. భర్త మృతిని జీర్ణించుకోలేక భార్య శోభ, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై బోరున విలపించారు. శ్రీనివాస్ మృతిపై తల్లి బుడ్డ లక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విద్యాచరణ్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News