Monday, December 23, 2024

రాహుల్ గాంధీ అభిప్రాయాన్ని బిజెపి సత్యమేనని రుజువు చేస్తోంది!

- Advertisement -
- Advertisement -

రాహుల్ గాంధీకి పార్లమెంట్‌లో మాట్లాడే హక్కును నిరాకరించడం ద్వారా, భారత దేశంలో ప్రజాస్వామ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అణచివేస్తోందన్న అభిప్రాయం సరైనదేనని రుజువవుతోంది.

న్యూఢిల్లీ: అధికార పక్షం, ప్రతిపక్షాల మధ్య జరిగిన వాగ్వివాదంతో ఇప్పటి వరకు బడ్జెట్ సెషన్ రెండో భాగంలో పార్లమెంటరీ వ్యవహారాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇంగ్లాండ్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని బిజెపి డిమాండ్ చేస్తోంది. తనకు పార్లమెంటులో మాట్లాడనిస్తే వివరణ ఇస్తానని రాహుల్ గాంధీ అంటున్నారు. మరోవైపు మోడీ, అదానీ లంకెపై చర్చ జరగాలని, అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలపై చర్చ జరగాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ ద్వారా విచారణ జరపాలని ప్రతిపక్షాలన్నీ ఒక్క గొంతుకతో కోరుతున్నాయి. కానీ మోడీ ప్రభుత్వం అందుకు సమ్మతించడం లేదు. ఇదిలావుండగా కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు రాహుల్ గాంధీపై ప్రతి దాడికి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగక, ప్రతిసారీ వాయిదా పడుతూ వస్తున్నాయి. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా గాంధీ కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వారి కుటుంబం నెహ్రూ పేరును కాక గాంధీ పేరును ఎందుకు ఉపయోగించుకుంటున్నాయన్నారు.

మోడీపై కాంగ్రెస్ సభాహక్కుల తీర్మానం(ప్రివిలేజ్ మోషన్) తేవాలని ప్రయత్నిస్తోంది. సభలో విమర్శలు చేసిన మంత్రులకు తగు జవాబు చెప్పడానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ లోక్‌సభ స్పీకర్‌ను డిమాండ్ చేస్తోంది. రాహుల్ గాంధీకి పార్లమెంటులో మాట్లాడే హక్కును ఇవ్వడం లేదన్నది స్పష్టం. ఓ విధంగా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తొక్కేస్తోంది. ప్రధానే స్వయంగా గాంధీ కుటుంబంపై అవాకులు చెవాకులు వాగుతున్నారు. మరో వైపు రాహుల్ ఇంగ్లాండ్‌లో చేసిన ప్రసంగాన్ని ‘దేశద్రోహం’ గా చిత్రీకరిస్తున్నారు. రాహుల్ గాంధీకి వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వడంలేదు. బిజెపి అధ్యక్షుడు జెపి. నడ్డా అయితే రాహుల్ గాంధీని ‘దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న పనిముట్టు’ (టూల్‌కిట్ ఎగనెస్ట్ ద కంట్రీ) అన్నారు.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను ఎన్నాళ్లు మాట్లాడనివ్వకుండా ఆపుతుంది? ప్రజాస్వామ్య పద్ధతులు అసలు పాటిస్తుందా? రాహుల్ గాంధీని దెబ్బతీయడమే బిజెపి లక్ష్యంగా కనబడుతోంది. ఆయనకు భారత్ జోడో యాత్ర ద్వారా చాలా ఆదరణ లభించింది. అదానీ గ్రూప్‌పై చర్చ జరగకుండా ఎన్నాళ్లు దాటవేయాలని కేంద్రం చూస్తోందన్నది ప్రశ్న. అధికార పక్షం, ప్రతిపక్షం ఒకరినొకరు దెప్పిపొడుచుకోవడంతోనే పార్లమెంటు సమావేశాలు వృథా అవుతున్నాయి. అసలు అధికార బిజెపి ప్రభుత్వానికి పార్లమెంటును నడిపే సత్తా ఉందా? అన్నది కూడా సవాలుగా తయారయింది. ఎంపీలకే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతో పార్లమెంటులోనే మాట్లాడే హక్కులేదా? అనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News