ఇంకా తెలియని మరో ఇద్దరి జాడ
ఉత్తరకాశి (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ మధ్య ఉండే హార్సిల్ చిట్కుల్ రూట్‌లో పర్వతారోహణకు వెళ్లిన 11 మంది బెంగాలీ ట్రెక్కర్లు మంచు చరియలు విరిగి పడి గల్లంతయిన విషయం తెలిసిందే, వీరిలో ఐదుగురి మృత దేహాలను శుక్రవారం ఉత్తర కాశీకి తీసుకు రాగా శనివారం మరో ఇద్దరి మృత దేహాలను ఐటిబిపి జవాన్లు కనుగొన్నారు. లంఖాగా పాస్ సమీపంలో కనుగొన్న ఈ మృత దేహాలను సంగ్లాకు తీసుకు వస్తున్నారని, అక్కడినుంచి ఉత్తర కాశీకి తీసుకు వెళతారని ఉత్తర కాశీ జిల్లా కలెక్టర్ మయూర్ దీక్షిత్ చెప్పారు. ఈ మృత దేహాలు శుక్రవారమే కనిపించాయి కానీ శనివారం సహాయ కార్యక్రమాలు ప్రారంభమైన తర్వాత మాత్రమే రికవరీ చేయగలిగారని ఆయన చెప్పారు. ఈ ఇద్దరినీ ఉత్తర కాశీ జిల్లా పురోలాకు చెందిన ఉపేంద్ర సింగ్( 37), కోల్‌కతాకు చెందిన రిచర్డ్ మండల్(30)గా గుర్తించినట్లు జిల్లా విపత్తుల నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్ తెలిపారు. మరో ఇద్దరి జాడ ఇంకా తెలియరాలేదు. 12 వేల అడుగుల ఎత్తులో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వీరి కోసం గాలింపు చర్యలను ఆపేశారని, వాతావరణం మెరుగు పడగానే తిరిగి ప్రారంభిస్తారని జిల్లా కలెక్టర్ చెప్పారు. ప్రాణాలతో బయటపడిన మరో ఇద్దరు హర్షిల్, ఉత్తర కాశీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.