Wednesday, January 22, 2025

జూబ్లీహిల్స్ ఎంఎల్‌ఎ కుమారుడిపై కేసు?

- Advertisement -
- Advertisement -

వీడియోలు వైరల్ చేసిన వ్యక్తి
అరెస్టు బాధిత బాలిక నుంచి
మరోసారి వాంగ్మూలం
‘అమ్నీషియా’లో బాధితురాలితో
పాటు మరో బాలికకూ వేధింపులు
పోలీసుల రిమాండ్ రిపోర్టులో
కీలక బిజెపి
ఎంఎల్‌ఎకు నోటీసులు
జారీచేసే అవకాశం సామూహిక
అత్యాచార ఘటనపై మహిళా
కమిషన్ సీరియస్, నివేదిక
ఇవ్వాలని డిజిపికి ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఈక్రమంలో బాధిత బాలిక నుంచి పోలీసులు మరోసారి వాంగ్మూలాన్ని సేకరించారు. ఈ కేసు దర్యాప్తు అధికారి ఎసిపి సుదర్శన్, మెజిస్టీరియల్ అధికారి సమక్షంలో బాలికతో పాటు తల్లిదండ్రులను అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నారు. అత్యాచార ఘటనలో కీలక అంశాలకు సంబంధించి బాధితురాలు, తల్లిదండ్రుల వాంగ్మూలాలు పోలీసులు నమోదు చేశారు. విచారణ సమయంలో ఎంఎల్‌ఎ కుమారుడు తనను బలవంతంగా తాకాడని వివరించడంతో ఎంఎల్‌ఎ కుమారుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయనున్నారు. అత్యాచార ఘటనకు సంబంధించి ఎంఎల్‌ఎ కుమారుడి ప్రమేయం ఉన్నట్లు తేలితే అతనిపై అత్యాచార కేసు కూడా నమోదు చేస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. కాగా ఇప్పటికే ఘటనకు పాల్పడిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు సోమవారం నాడు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచార ఘటనకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేసిన పాతబస్తీకి చెందిన సుభాన్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన నిందితులను వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టును పోలీసులు కోరారు.

రిమాండ్ రిపోర్ట్‌లో కీలక విషయాలు 

ఆమ్నీషియా పబ్ రేప్ కేసులో బాధిత బాలికతోపాటు మరో మైనర్ బాలికను యువకులు వేధించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ కేసులో కార్పొరేటర్ కుమారుడు కీలక పాత్ర వహించాడని, సాదుద్దీన్ మాలిక్, కార్పొరేటర్ కొడుకు కలిసి ఇద్దరు పబ్ లోనే మైనర్ బాలికలను వేధింపులకు గురి చేశారని తెలిపారు. అక్కడ వారివేధింపులు భరించలేక ఇద్దరూ కలిసి బయటకు వచ్చారని, బాలికల వెనకాలే సాదుద్దీన్ గ్యాంగ్ బయటకు వచ్చిందని రిపోర్ట్‌లో పేర్కొన్నారు. బయటకు వచ్చిన ఒక బాలిక వేరుగా క్యాబ్ తీసుకుని వెళ్లిపోయింది. పబ్ ముందే నిలబడ్డ బాధిత బాలికను కార్పొరేటర్ కొడుకు ట్రాప్ చేసి ఇంటి వద్ద దించుతామని బాలికను నమ్మించి ఉమేర్‌ఖాన్‌కు చెందిన బెంజ్ కారులో తీసుకువెళ్ళారని తెలిపారు. ఆ కారులో అమ్మాయితో కలిసి నలుగురు ప్రయాణించారని, పబ్ నుంచి నేరుగా కాన్సూ బేకరి వరకు గ్యాంగ్ వెళ్లింది. పబ్ నుంచి కాన్సూ బేకరీకి వెళ్లే లోపే బెంజ్ కారులోనే అమ్మాయి పట్ల గ్యాంగ్ అసభ్యకరంగా ప్రవర్తించింది. అరాచకాలు భరించలేక కాన్సూ బేకరి నుంచి బాధిత బాలిక వెళ్లిపోతానని చెప్పింది.

బాలికను మళ్లీ బెంజ్ కారులో ఎక్కించుకొని కొద్దిదూరం ప్రయాణించారు. ఎంఎల్‌ఎ కుమారుడికి ఫోన్ కాల్ రావటంతో మధ్యలోనే దిగి వెళ్లిపోయాడు. ఆతర్వాత బెంజ్ కారులో పెట్రోల్ అయిపోయిందని చెప్తూ సాదూద్దీన్ గ్యాంగ్ డ్రామాలు ఆడింది. వెనుకాలే మరో ఇన్నోవాలో వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ కుమారుడు వచ్చాడు. ఆ తర్వాత బాలికను గ్యాంగ్ ఇన్నోవాలోకి తరలించింది. బంజారాహిల్స్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై గ్యాంగ్ అత్యాచారానికి పాల్పడినట్లు రిపోర్ట్‌లో వివరించారు. అదేవిధంగా బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాత నిందితులు బేకరికి దగ్గరకి చేరుకుని తాము ఎంజాయ్ చేశామని గ్రూప్ ఫోటో దిగి ఇన్‌స్టాలో పోస్టు చేశారు. బేకరి నుంచి నిందితులు ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. కేసు నమోదు కాగానే హైదరాబాద్ నుంచి నిందితులు పారిపోయారు. ఇన్నోవా కారును నిందితులు వక్ఫ్‌బోర్డ్ చైర్మన్ ఫాంహౌస్‌లో దాచారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కోన్నారు.

ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌లో పరీక్షలు 

అత్యాచార ఘటనలో నిందితులు ఉపయోగించిన బెంజ్ కారులో క్లూస్ టీం ఆధ్వర్యంలో బాలిక చెవి కమ్మ, చెప్పులు, వెంట్రుకలు, నిందితుల వీర్యాన్ని (స్పెర్మ్) పరీక్షల నిమిత్తం పోలీసులు ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌కు తరలించారు. ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ ల్యాబ్ అధికారులు త్వరితగతిన పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. అలాగే కారులో స్వాధీనం చేసుకున్న టిష్యూ పేపర్లు సైతం పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు పోలీసులు వెల్లడించారు.

తప్పించుకున్న మరో బాలిక 

ఆమ్నీషియా పబ్ రేప్ కేసు విచారణలో పబ్‌లో మరో మైనర్ బాలికను నిందితులు వేధించినట్లు వెలుగుచూసింది. ఈ కేసులోని నిందితులు సాదుద్దీన్ మాలిక్, కార్పొరేటర్ కొడుకు కలిసి ఇద్దరు పబ్ లోనే మైనర్ బాలికలను వేధింపులకు గురి చేశారు. అక్కడ వారివేధింపులు భరించలేక ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు. బాలికల వెనకాలే సాదుద్దీన్ గ్యాంగ్ బయటకు వచ్చింది. నిందితుల రాకను గమనించిన మరో మైనర్ బాలిక పరుగెత్తుకుంటూ బయటకు వచ్చి క్యాబ్ లో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలో పబ్ ముందే నిలబడ్డ బాధిత బాలికను కార్పొరేటర్ కొడుకు ట్రాప్ చేసి సామూహిక అత్యాచారం చేశారు.

బిజెపి ఎంఎల్‌ఎకు నోటీసులు ? 

జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనకు సంబంధించి బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ రావు విడుదల చేసిన ఫోటోలు, వీడియోలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. మైనర్ బాలిక అత్యాచారానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఈ వీడియోలు ఎవరు సోషల్ మీడియాలో పెడుతున్నారో వారిపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా పోలీసులు ఎంఎల్‌ఎ రఘునందన్ రావుకు కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలియవచ్చింది. ఈ ఫోటోలు, వీడియోలు ఎంఎల్‌ఎకు ఏ విధంగా లభించాయో అన్నదానిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు.ఇదిలావుండగా బిజెపి ఎంఎల్‌ఎ రఘునందన్ వీడియోలు విడుదల చేయడంపై ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థులు బిజెపి కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించారు. ఒక బాలికకు సంబంధించిన వీడియోలు బహిరంగ పర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బిజెపి కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

మహిళా కమిషన్ సీరియస్ 

అమ్నేసియా పబ్ కేసు విషయమై మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. బాలికపై గ్యాంగ్ రేప్ కేసును సుమోటోగా మహిళా కమిషన్ స్వీకరించింది. సమగ్ర రిపోర్ట్ ఇవ్వాలని సోమవారం నాడు డిజిపికి మహిళ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. కేసు రిపోర్ట్ చూసిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మా రెడ్డి వెల్లడించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సునీతా లక్ష్మారెడ్డి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News