Thursday, January 23, 2025

పెళ్లి విందులో ప్లేట్ల విషయంలో గొడవ.. కేటరింగ్ ఉద్యోగిని కొట్టి చంపిన డిజె బృందం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పెళ్లి విందులో భోజనం చేసే ప్లేట్ల విషయంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కేటరింగ్ వ్యక్తిని డిజె బృందం కొట్టి చంపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రోహిణి ప్రాంతంలోని జపనీస్ పార్కులో బుధవారం రాత్రి ఓ పెళ్లి వేడుక జరిగింది.హాజరైన అతిథులంతా భోజనాలు చేసి వెళ్లిపోయిన తర్వాత డిజె టీమ్ సభ్యులు, కేటరింగ్ సిబ్బంది విందు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే భోజనం ప్లేట్లను తిరిగి వినియోగించాల్సి ఉండడంతో డిజె బృందాన్ని త్వరగా తినాలని కేటరింగ్ సిబ్బంది కోరారు. ఆ తర్వాత భోజనం చేసేందుకు వారు వేచి ఉన్నారు. అయితే మెల్లగా తింటున్న డిజె బృందంపై వారు మండిపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.

ఈ నేపథ్యంలో డిజె బృందంలో ఒకరు ప్లాస్టిక్ డబ్బాతో కేటరింగ్ చేసే సందీప్ ఠాకూర్ అనే 48 ఏళ్ల వ్యక్తిపై తలపై బలంగా కొట్టాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఠాకూర్ హత్యకు సంబంధించి డిజె బృందంలోని ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరో ఇద్దరు నిందితులకోసం గాలిస్తున్నారు. మృతుడు సందీప్ ఠాకూర్‌కు భార్య, అయిదుగురు పిల్లలున్నారని మృతుడి సోదరుడు చెప్పాడు. తమకు న్యాయం చేయాలని అతను డిమాండ్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News