Monday, January 20, 2025

కృష్ణ ట్రిబ్యునల్ పై కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది

- Advertisement -
- Advertisement -

ఆ పార్టీ నాయకులు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదు
9 ఏళ్ల కాలయాపన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధకరం
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్

మన తెలంగాణ/హైదరాబాద్:  కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఏర్పాటుపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 9 ఏళ్లు తాత్సారం చేసిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. ఇటీవల ఆపార్టీ నాయకులు బండి సంజయ్, కిషన్ రెడ్డి అవగాహన లేకుండా, వాస్తవ విషయాలు తెలియక మాట్లాడిన తీరు తేటతెల్లమైందని ఎద్దేవా చేశారు. శుక్రవారం సాయంత్రం మంత్రుల నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అక్టోబర్ 4 న కేంద్ర క్యాబినెట్ తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపకం కోసం నదీ జలాల వివాదాల చట్టం 1956, సెక్షన్ 5(1) ప్రకారం ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు అదనపు టిఓఆర్‌ను నివేదించాలని తీసుకున్న నిర్ణయం స్వాగతించాల్సిందేనన్నారు.

9 ఏళ్ల కాలయాపన తర్వాత ఎన్నికల ముందు ఈ నిర్ణయం వెలువడటమే బాధాకరమన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం తాత్సారంతోనే కృష్ణా జలాల ట్రిబ్యునల్ ఆలస్యం జరిగిందని అనడం చూస్తూంటే వారు తమ తప్పిదాన్ని కప్పి పుచ్చుకోవడానికి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిద్దరికి కూడా కృష్ణా నది జలా పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరాయంగా చేసిన పోరాట చరిత్ర తెలియదని తెలంగాణకు ఇది గొప్ప విజయం సిఎం కెసిఆర్ పట్టుబట్టి సాధించినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటైన నెల రోజులకే సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఆనాటి సాగునీట శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరి అరవింద్ రెడ్డి నదీ జలాల వివాదాల చట్టం 1956, సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని 14 మే 2014 న లేఖ రాసినట్లు చెప్పారు.

కేంద్రం ఐఎస్‌ఆర్ డబ్ల్యూ  చట్టానికి బదులుగా రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం విచారణకు ఆదేశించిందని, ఈ విచారణతో తెలంగాణకు న్యాయమైన వాటా లభించే అవకాశం లేదని సిఎం కెసిఆర్ తెలుసునని అందుకే ఆయన నిరంతరాయంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. 2018లో ఈ విచారణను తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేయాలని కోరారు. ఏడాది కాల పరిమితి విధిస్తూ కృష్ణా ట్రిబ్యునల్ ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో 10 ఆగస్టు 2015న రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వంపై రిట్ పిటిషన్‌ను వేసిందన్నారు.అక్టోబర్ 2020 లో జరిగిన రెండవ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇదే అంశంపై తీవ్రంగా పట్టుబట్టారు. ఆన్‌లైన్ పద్ధతిలో జరిగిన సమావేశంలో తాను కూడా పాల్గొన్నట్లు చెప్పారు.

సిఎం కెసిఆర్ ఒత్తిడికి తల ఒగ్గిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన కేసును విరమించుకునే షరతుపై ట్రిబ్యునల్ కి రిఫర్ చేయడానికి అంగీకరించినట్లు పేర్కొన్నారు. అయితే కేసు విరమించుకున్న తక్షణమే ట్రిబ్యునల్ వేసేందుకు హామీ ఇవ్వాలని కెసిఆర్ పట్టు బడితే, మేము న్యాయ మంత్రిత్వ శాఖ సలహా తీసుకున్న తర్వాతనే ఒక నిర్ణయం ప్రకటిస్తామని కేంద్ర మంత్రి అన్నారు. తక్షణమే ట్రిబ్యునల్ వేసి విషయంలో కేంద్ర మంత్రి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని న్యాయ సలహా వచ్చే దాకా వేచి చూడాలను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కాని కేంద్రం మాత్రం న్యాయ సలహాకు ఫైల్ పంపి విషయంలో తాత్సారం చేస్తూనే ఉన్నదని ఆ తాత్సారానికి తెలంగాణ సుప్రీం కోర్టు కేసును కారణంగా చూపించిందన్నారు.

కేంద్ర మంత్రి షెఖావత్‌ను మరొక సారి ఢిల్లీలో కలిసిన తర్వాత ఆయన హామీ మేరకు కెసిఆర్ కేసును విత్ డ్రా చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆదేశాల మేరకు ప్రభుత్వం 2021 జూన్ లో విత్ డ్రా పిటిషన్ వేసిందని సుప్రీం కోర్టు అక్టోబర్ 2021 లో పిటిషన్ అనుమతించిందన్నారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకు ఈ నిర్ణయం వెలువడిందని, పిటిషన్ విరమించుకున్న తర్వాత ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయడానికి 2 ఏండ్ల కాలం ఎందుకు తీసుకున్నారని… ఈ తాత్సారం ఎవరిది? అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఈ మధ్య కాలంలో ఎన్ని వేదికల ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేసామో లెక్క లేదు మా అధికారులు లెక్క లేనన్ని లేఖలు రాశామని అయినా కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడానికి కారణం ఎవరని నిలదీశారు. తెలంగాణాకు న్యాయమైన నీటి వాటా పొందడంలో కేంద్రం సహకారం శూన్యం.

2018 నుంచే మీ సాగునీటి అవసరాలు పెరిగినందున కృష్ణా జలాల్లో మా వాటా తాత్కాలికంగా 50 శాతానికి పెంచాలని కోరుతూనే ఉందన్నారు. కెఆర్‌ఎంబి సమావేశాల్లో డిమాండ్ చేస్తూనే ఉన్నదని అయినా 50 శాతం తాత్కాలిక వాటాను ఇవ్వలేదని 2015 లో తాత్కాలికంగా ఒక సంవత్సరానికి అంగీకరించిన 66:34 శాతం నీటి వాటాలను ఏండ్ల తరబడి కొనసాగించడం అన్యాయమన్నారు. అదే సమయంలో సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ కు నివేదించలేదని ఈనెపం సిఎం కెసిఆర్ ప్రభుత్వం మీదకు నెట్టి వేయడం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తగ్గిదని కాదని వాస్తవాలు తెలియకుండా ఆయన చేసిన వ్యాఖ్యానాలను నేను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికి 9 ఏళ్ల విలువైన కాలం హరించుకుపోయింది కనుక ఒకటి రెండు ఏళ్ల నిర్దిష్ట కాల పరిమితిని విధిస్తూ ట్రిబ్యునల్ కు అదనపు టిఓఆర్ నివేదిస్తే తెలంగాణకు కృష్ణ జలాల్లో న్యాయమైన వాటా త్వరితగతిన దక్కుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ దశాబ్దాలుగా కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను కోల్పోయింది. కేంద్ర క్యాబినెట్ నిర్ణయం ద్వారా త్వరితగతిన పునః పంపిణీ ప్రక్రియ పూర్తి కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి న్యాయమైన వాటా లభించేదాకా ఈ పోరాటం కొనసాగిస్తామని తెలంగాణా ప్రయోజనాలను కాపాడి విషయంలో తెలంగాణా ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తి ఉత్పన్నం కాదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News