Monday, December 23, 2024

కేంద్రం దా’రుణం’

- Advertisement -
- Advertisement -

రాష్ట్రానికి స్వయంగా అప్పివ్వదు.. తెచ్చుకోనివ్వదు

తెలంగాణపై అంతులేని వివక్ష
తన నిబంధనలనే పాటిస్తున్నా
కనికరించని మోడీ ప్రభుత్వం
బడ్జెట్ బయటి అప్పులను కూడా
రాష్ట్రాల రుణాలుగా
పరిగణిస్తామనడం అత్యంత
కక్ష పూరిత చర్య : కేంద్రానికి
తెగేసి చెప్పిన రాష్ట్ర ఆర్థిక
శాఖ ప్రధాన కార్యదర్శి
కె.రామకృష్ణారావు సారథ్యంలోని
అధికారుల బృందం

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మరోసారి స్పష్టమయ్యింది. రాష్ట్రాల అప్పుల సమీకరణకు నిబంధనల పేరుతో కేంద్ర ప్రభుత్వం ముందరికాళ్ళకు బంధనాలు వేయడం తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చూపిస్తున్న వివక్షను రాష్ట్ర ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు నిర్మొహమాటంగా కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖకు స్పష్టంచేశారు. 15వ ఆర్ధిక సంఘం ఏ విధమైన సిఫారసులు చేయకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అకస్మాత్తుగా ’ఆఫ్ బడ్జెట్‌” అప్పులను రాష్ట్రాల అప్పులుగా పరిగణిస్తామని చెప్పడం అత్యంత కక్షపూరిత చర్య అని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సారధ్యంలోని అధికారుల బృందం కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు తెగేసి చెప్పారు. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులు సోమవారం నిర్వహించిన రాష్ట్రాల ఆర్ధిశాఖాధికారుల వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

15వ ఆర్ధిక సంఘం నివేదికలో పేర్కొనని విషయాలను ఆ పేరుతో అమలు చేయడం తెలంగాణ రాష్ట్రంపై చూపే కక్షసాధింపు చర్యగా, వివక్షపూరితమైన చర్యలుగా భావించడం జరుగుతుందని ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఒకవేళ నూతన నిబంధనలను అమలు పరచదలిస్తే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం నుంచి అమలు చేయాలి గానీ ఇలా 2020-21వ ఆర్ధిక సంవత్సరం నుంచి అమలు చేయడం అత్యంత వివక్షపూరితమైన చర్యని రాష్ట్ర అధికారులు కేంద్రానికి తీవ్ర నిరసనగా చెప్పారు. రాజ్యాంగం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి అప్పు తీసుకోవడానికి ఇవ్వవలసిన అనుమతులను వెంటనే ఇవ్వాలని, లేకుంటే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి ప్రతిబంధకంగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అప్పులు సేకరించే విషయంలో కేంద్రం ఎలాంటి నిబంధనలను పాటిస్తుందో అవే నిబంధనలను తెలంగాణ ప్రభుత్వం కూడా పాటిస్తుందని, అయినా ఈ కక్షసాధింపులు, వివక్ష చూపడం వంటి చర్యలు సరికాదని రాష్ట్ర ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్‌లో పైకి ఉబికి వచ్చిన కోపాన్ని, బాధను దిగమింగుకుంటూనే కేంద్ర ఆర్ధికశాఖాధికారులకు అంతులేని అసంతృప్తిని తెలియజేశారు.

వెంటనే తెలంగాణ ప్రభుత్వంపై ఎలాంటి వివక్షచూపకుండా రాజ్యాంగం ప్రకారం అప్పులు తెచ్చుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. కేంద్ర ఆర్ధికశాఖ కార్యదర్శి టి.వి.సోమనాధన్ మాట్లాడుతూ రాష్ట్రాలు ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులకు అదనంగా వివిధ కార్పోరేషన్ల ద్వారా నిధులను సమకూర్చుకొని ఆ అప్పులను రాష్ట్రాల నిధుల నుంచి చెల్లిస్తున్నాయని, అందుచేత ఆ అప్పులను రాష్ట్రాల అప్పులుగానే పరిగణిస్తామని చెప్పడంతో తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల ఆర్ధికశాఖల కార్యదర్శులు కేంద్రం తీరుపై తీవ్ర ఆగ్రహం, అసహనం, అంతులేని అసంతృప్తులను వ్యక్తంచేశారు. ఇలాంటి చర్యలు ముమ్మాటికీ రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం మోకాలడ్డుతున్నట్లుగానే ఉందని ఆర్ధికశాఖల కార్యదర్శులు కేంద్రంపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మాట్లాడుతున్నంతసేపూ వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న 27 రాష్ట్రాల అధికారులు సంపూర్ణంగా మద్దతు తెలిపారు. రామకృష్ణారావు ప్రసంగానికి బీజేపీ పాలిత రాష్ట్రాల అధికారులు కూడా అభ్యంతరం తెలపకుండా ఓపికగా వింటూ మద్దతు పలికారని తెలిసింది.

కేరళ, ఆంధ్రప్రదేశ్ అధికారులైతే తెలంగాణ ఆర్ధికశాఖాధికారులు లేవనెత్తిన అంశాలకు సంపూర్ణంగా మద్దతు పలికారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానంగా మూడు అంశాలపైన చర్చలు జరిగాయి. మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు ప్రత్యేకంగా సహాయం చేయడం కోసం, 2022-23వ ఆర్ధిక సంవత్సరానికి రాష్ట్రాలకు రుణాలు తీసుకునే మార్గదర్శకాలను ఖారారు చేయడం కోసం, కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధుల కోసం ప్రత్యేకంగా ఒకే నోడల్ ఏజన్సీని ఏర్పాటు చేయించడం కోసం ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో చర్చలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్రమే కాకుండా మెజారిటీ రాష్ట్రాలూ తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాయి. ఈ ప్రతిపాదనలు రాష్ట్రాల అభివృద్ధిని అడ్డుకోవడమే కాకుండా ముమ్మాటికీ తెలంగాణ వంటి రాష్ట్రాలపై కక్షసాధింపు చర్యలేనని అధికారులు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్తగా ప్రవేశపెట్టే ఎలాంటి నిబంధనలనైనా ఆ రోజు నుంచి అమలు చేస్తారని, లేకుంటే ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం నుంచి అమలు చేస్తారని, కానీ కేంద్రం ప్రవేశపెట్టిన రూల్సును మూడేళ్ళ క్రితం నుంచి అమలుచేస్తూన్నట్లుగా ప్రకటించడమంటే ముమ్మాటికీ కక్షసాధింపేనని రామకృష్ణారావు కేంద్రంపై విరుచుకుపడ్డారు.

కార్పోరేషన్ల ద్వారా సేకరించిన రుణాలను కూడా రాష్ట్ర అప్పులుగా పరిగణిస్తామని, అది కూడా 2020-21వ సంవత్సరంలోని 12 వేల కోట్లు, 2021-22వ ఏడాదిలోని 15 వేల కోట్లు, 2022-23వ సంవత్సరంలోని లక్ష కోట్ల రూపాయలను లోన్‌ల రూపంలో రాష్ట్రాలకు ఇస్తూ వాటిని మూలధన వ్యయంగా పరిగణిస్తూన్నామని, ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలోనికి రాదని కేంద్రం చెప్పడంతో అన్ని రాష్ట్రాల ఆర్ధికశాఖ ఉన్నతాధికారులు షాక్‌కు గురయ్యారని తెలిసింది. ఇదెక్కడి చోద్యమని కొన్ని బి.జే.పి. పాలిత రాష్ట్రాల అధికారులు కూడా పెదవి విరిచారని సమాచారం. వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ఆర్ధికశాఖ స్పెషల్ సి.ఎస్.రామకృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు మూలధన వ్యయానికి సంబంధించినవని, ఈ హామీలు ప్రధానం కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పోరేషన్ లిమిటెడ్, తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పోరేషన్ లిమిటెడ్, తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డవలప్‌మెంట్ కార్పోరేషన్‌లకు చెందినవి మాత్రమేనని వివరించారు.

ఈ ప్రాజెక్టులన్నీ వివిధ దశల్లో ఉన్నాయని, ఈ ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తయితేనే ఆయా కార్పోరేషన్లు ప్రభుత్వ గ్యారెంటీలపై పొందిన రుణాలను తిరిగి చెల్లించగలగే పరిస్థితికి రాగలవని రామకృష్ణారావు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన హడ్కో, ఎన్‌సిడిసిలు ఇచ్చే అప్పులకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లింపులు చేస్తున్నప్పటికీ వాటిని రాష్ట్రాల అప్పుల పరిధిలోనికి తీసుకురాలేదని, కొన్ని అప్పులను ఎఫ్‌ఆర్‌బిఎం పరిధిలో చూపడం జరిగిందని, మరికొన్నింటినీ చూపకపోవడం వంటివి వివక్షపూరిత చర్యలు కాదని, ఇందులో ఎలాంటి నేరమూ లేదని, కేంద్రం కూడా ఇదే పద్దతిలో వ్యవహరిస్తూనే ఉందని, అవన్నీ వదిలేసి రాష్ట్రాలపై ముఖ్యంగా తెలంగాణపై ఇలాంటి వేధింపులు, కక్ష సాధించడాలు ఎందుకు? అని రామకృష్ణారావు గట్టిగా నిలదీశారు.

ఇలా అడ్డదిడ్డంగా సమస్యలు సృష్టిస్తూ 2022-23వ ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకూ అప్పులు తెచ్చుకోవడానికి కేంద్రం అనుమతులు ఇవ్వకుండా కాలయాపన చేయడం అన్యాయం, దారుణమని రామకృష్ణారావు కేంద్రానికి తీవ్ర నిరసనను తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన రాష్ట్ర కావున ప్రజల ఆకాంక్షల మేరకు వివిధ అభివృద్ధి పథకాలకు వివిధ కార్పోరేషన్ల ద్వారా నిధులను సమీకరించుకొని కొద్దికాలంలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలలో మిగతా రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచిందని, మూలధన వ్యయంలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. ఇలాంటి పరిస్థితుల్లో అనేక కొర్రీలుపెట్టి అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇవ్వకుండా అడ్డుపడితే తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వమే అడ్డుకుంటున్నట్లుగా భావించాల్సి ఉంటుందని కూడా హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News