న్యూఢిల్లీ: నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకులు..సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో వాటాను తగ్గించుకోవాలని కేంద్రం యోచిస్తోందని వినికిడి. దీని కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ రాబోయే నెలల్లో కేంద్ర కేబినెట్ నుంచి ఆమోదం పొందే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 93 శాతం, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో 96.4 శాతం, యూకో బ్యాంక్ లో 95.4 శాతం, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ లో 98.3 శాతం కంటే ఎక్కువ వాటా ఉంది. సెబీ నిబంధనల ప్రకారం అన్ని నమోదిత కంపెనీల్లో పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25 శాతం ఉండాలి. అయితే ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలకు సెబీ నిబంధనల నుంచి మినహాయింపు 2026 ఆగస్టు వరకు ఇచ్చింది. కాగా ఈ నిబంధనలకు అనుగుణంగా 75 శాతం కంటే దిగువకు తీసుకొచ్చేందుకు బ్యాంక్ లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.