Thursday, January 23, 2025

మేడిగడ్డపై మరింత సమాచారమివ్వండి

- Advertisement -
- Advertisement -

20అంశాలపై సమగ్ర వివరణ కావాలి
గడువు పెట్టి లేఖ రాసిన నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ

మనతెలంగాణ/హైదరాబాద్: కాళేశ్వరం పధకంలో అంతర్భాగమైన మేడిగడ్డ లక్ష్మీబ్యారేజికి సంబంధించి మరింత సమాచారం కావాలని కేంద ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని కోరింది. మేడిగడ్డ బ్యారేజి కుంగుబాటుకు సంబంధించిన 20 అంశాలను లేవనెత్తి ఆమేరకు అడిగిన సమాచారం పంపాలని కోరుతూ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ శనివారం రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాసింది. తాము అడిగిన సమాచారం ఆదివారం లోగా తమకు అందజేయాలని కోరింది.

గోదావరి నదిపై రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధులతో కాళేశ్వరం ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మేడిగడ్డ లక్ష్మిబ్యారేజ్‌కి ఇటీవల స్వల్ప ప్రమాదం సంభవించింది. బ్యారేజిలో ఏడవ బ్లాకునకు చెందిన కొన్ని పిల్లర్లు భూమిలోకి కుంగిపోయాయి. ఈ సంఘటలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై పమాదం మరింత పెరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. బ్యారేజిలో అప్పటికే నిలువ ఉన్న 10టిఎంసీల నీటిని గేట్లు ఎత్తి దిగువ గోదావరినదిలోకి వలిలేసింది. బ్యారేజిలో నీటిని ఖాళీ చేసి పిల్లర్ల కుంగుబాటు ఘటనపై సమగ్రంగా పరిశీలన చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం కూడా మేడిగట్ట ఘనటపై వెంటనే స్పందించింది.

డ్యామ్ సేఫ్టీ అథారిటి చైర్మన్ నేతృత్వంలో ఆరుగురు నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసి మేడిగడ్డ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కమిటీని ఆదేశించింది. రెండు రోజుల కిందటే ఈ కమిటీ మేడిగడ్డను సందర్శించింది. తెలంగాణ రాష్ట్రనీటిపారుదల శాఖ అధికారులు కేంద్ర కమిటీకి మేడిగడ్డ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అందజేశారు. పిల్లర్ల కుంగుబాటును నిశితంగా పరిశీలన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేసి కేంద్ర బృందానికి పూర్తి స్థాయిలో సహకారం అందజేసింది. కేంద్ర బృందం హైదరాబాద్ జలసౌధలోనూ రాష్ట్ర నీటిపారుదల అధికారులతోపాటు బ్యారేజి నిర్మాణంలో పాలుపంచుకున్న ఎల్‌అండ్‌టి ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర బృందం అడిగిన అన్న అంశాలకు రాష్ట్ర అధికారులు సమగ్ర వివరణ ఇచ్చారు. సాంకేతిక పరమైన అన్ని అంశాలను వివరించారు. కేంద్ర బృందం కోరిన సమాచారాన్ని అందజేశారు.

మళ్లీ 20అంశాలతో కేంద్ర బృందం లేఖ:
మేడిగడ్డ ఘటనపై మరిన్ని వివరాలతో సమాచారం కావాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.లేఖలో ఆదివారంలోపే సమాచారం పంపాలని లేకపోతే రా్రష్ట్ర ప్రభుత్వం వద్ద మేడిగడ్డ బ్యారేజికి సంబంధించి తాము అడిగిన సమాచారం లేదని భావించాల్సి వస్తుందని లేఖలో తెలిపింది. ఇప్పటివరకూ మేడిగడ్డ బ్యారేజి ఘటనలో తమకు నాలుగు అంశాలకు సంబంధించిన సమాచారం మాత్రమే అందజేశారని , ఇంకా 16 అంశాలకు సమాచారం అందజేయాలని తెలిపింది. ఇందులో ప్రధానంగా ప్రాజెక్టు క్వాలిటీ, జియలాజికల్ స్టడీ రిపోర్ట్, బ్యారేజిని నిర్మించిన కాంటాక్టు సంస్థ లయబులిటి తదితర అంశాలను లేఖలో డ్యామ్ సేఫ్టీ అథారిటీ ప్రస్తావించింది. ఆదివారం లోగా తాము కోరిన విధంగా అన్ని అంశాలకు సంబంధించిన వివరాలను పంపాలని లేఖలో సూచించింది.

మేడిగడ్డ రిపేర్లపై యుద్దప్రాతిపదికన చర్యలు:
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ ఘటనపై యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఏడవ బ్లాకులో 16,17,18,19,20 పిల్లర్ల సమస్యను చక్కదిద్దేపనులపై దృష్టి సారించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతస్థాయి అధికారయంత్రాంగం బ్యారేజి రిపేర్లపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించింది. బ్యారేజిలో నీలువ నీటిని ఇప్పటికే ఖాళీ చేయించింది. ఎగువ నుంచి వస్తున్న కొద్దిపాటి నీటి ప్రవాహాన్ని కూడా ఎప్పటికప్పుడు దిగువకు పంపేందుకు ఇప్పటికే తెరిచి ఉంచిన 57గేట్లతోపాటు మరో 11గేట్లను ఎత్తివేసింది. ఏడవ బ్లాకులో 20వ పిల్లరు భూమిలోకి కొంత మేరకు కుంగిపోవటంతో ఆ ప్రభావం పక్కన ఉన్న మరి కొన్ని పిల్లర్లపై కూడా పడటంతో ఈ బ్లాకు ఉన్న ప్రాంతంలో రింగ్‌బండ్ వేసి ఎగువ నుంచి వచ్చేనీరు అటువైపు రాకుండా నీటిమళ్లింపునకు అవసరమైన చర్యలు చేపట్టింది. కాఫర్ డ్యాం నిర్మించే ప్రయత్నాలపై దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి యంత్రాలు , ఇతర సామాగ్రిని మేడిగడ్డ బ్యారేజి ప్రాంతానికి చేరవేసేందుకు చర్యలు చేపట్టింది.రాష్ట్ర బ్యారేజిల భద్రాత కమిటి చైర్మన్ ఏ.బి పాండేతోపాటు నీటిపారుద శాఖ ఈఎన్సీ మురళీధర్ మేడిగడ్డ బ్యారేజి రిపేరి ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంబించనున్నట్టు నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News