రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి ఈసి బృందం
విజయవాడ నోవాటెల్ హోటల్‌లో అధికారులతో సమీక్ష
మన తెలంగాణ/హైదరాబాద్: ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కసరత్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగవంతం చేసింది. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రానికి వచ్చి ఈసి బృందం అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించింది. ఓటర్ల జాబితా అంశంతో పాటు ఎన్నికల సన్నాహాకాలపై చర్చిచనుంది. డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ఈసీ బృందం రాష్ట్రానికి చేరుకుని విజయవాడ నోవాటెల్ హోటల్‌లో అధికారులతో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సమీక్ష నిర్వహించింది. ఈసి బృందానికి ఎన్నికల సన్నద్ధతపై కలెక్టర్లు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఒక్కొక్క జిల్లా కలెక్టర్ ఎన్నికల సన్నద్ధతపై 15 నిమిషాల పాటు ఎన్నికల అధికారులకు వివరించారు. జిల్లాల వారీగా ఓటర్ల జాబితా, ఎన్నికల నిర్వహణ సన్నద్ధత పరిస్థితిపై నివేదికలు సమర్పించారు. శనివారం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ- 2024తో పాటు, రాబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సన్నద్ధత తదితర అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం జరపనుంది. రెండో రోజు మిగిలిన 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ జవహర్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాదికారి ముకేష్ కుమార్ మీనా పాల్గొన్నారు.