పుతిన్‌కు ఫోన్‌లో తెలిపిన చైనా నేత
బీజింగ్ : రగులుతున్న రష్యా ఉక్రెయిన్ సంక్షోభ నివారణలో సహకరించేందుకు తాను సిద్ధమని చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్ ప్రకటించారు. ఈ విషయాన్ని చైనా అధికార వార్తా సంస్థ జిన్హూవా బుధవారం తెలిపింది. ఉక్రెయిన్‌కు సంబంధించి ఇది తీవ్రస్థాయి సంక్షోభమే. దీనిని పరిష్కరించే దిశలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు అధినేత సంసిద్ధత వ్యక్తం చేశారని సంస్థ వివరించింది. రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌తో బుధవారం చైనా అధినేత ఫోన్‌లో మాట్లాడారు. యుద్ధ సంక్షోభ విషయం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. సబంధిత పక్షాలన్ని కూడా బాధ్యతాయుత వైఖరితో వ్యవహరించాలి. తద్వారా ఉక్రెయిన్‌లో ప్రస్తుత సంక్షోభం సమసిపోయితీరేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందని చైనా అధ్యక్షులు స్పష్టం చేశారు. అవసరం అయితే ఈ దిశలో తాను కీలక పాత్ర వహించేందుకు సిద్ధమని కూడా తెలిపారు.