Sunday, November 24, 2024

కాళేశ్వరంపై కొత్త డ్రామాలు

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరంపై కాంగ్రెస్ నేతల ఆరోపణలు అవాస్తవమని తేలింది: బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి
కాళేశ్వరంపై వాస్తవాలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన కడియం

మనతెలంగాణ/హైదరాబాద్ : శ్వేతపత్రాలు, న్యాయ విచారణల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకాలు ఆడుతోందని మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎంఎల్‌ఎ కడియం శ్రీహరి విమర్శించారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే న్యాయ విచారణ జరగాలన్నారు. బిఆర్‌ఎస్ శాసనసభాపక్షం కార్యాలయంలో ఎంఎల్‌ఎలు, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌లతో కలిసి కార్యాలయంలో శుక్రవారం మీడియా సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారని, కానీ, రూ.93 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు అదికారులు చెప్పారని, ఈ విషయాన్ని ప్రభుత్వమే అంగీకరించిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి వాస్తవాలు తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద చేపడితే రూ.38 వేల కోట్లకే పూర్తయ్యేదని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.80వేల కోట్లకు పెంచారంటున్నారని, 141 టిఎంసిలు నిల్వ చేసేలా రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని వివరించారు. అనేక రిజర్వాయర్ల నిర్మాణాల వల్ల వ్యయం పెరిగిందనే విషయాన్ని గమనించాలని తెలిపారు.

కేంద్రం అనుమతులతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని తేలిందని కడియం శ్రీహరి వివరించారు. అధికారులు ఇచ్చిన ప్రజంటేషన్ ప్రకారం 98వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు ఇచ్చామని చెప్పారని.. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరానికి నీళ్లు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ చేసిన ప్రచారం అవాస్తవం తేలిందని కడియం శ్రీహరి అన్నారు. ప్రాజెక్టు కింద ఎకరాకు నీరు ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారని.. కానీ 98వేల ఎకరాలకు నీరు ఇచ్చినట్లు అధికారులే చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రాలు, న్యాయ విచారణలను తాము స్వాగతిస్తున్నామని అన్నారు. తుమ్మిడి హట్టి ద్వారా గ్రావిటీతో నీళ్లు తీసుకురావచ్చని మంత్రి అబద్ధాలు చెప్పారన్నారు. 2008 నుంచి 2014 వరకు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మహారాష్ట్రతో ఎందుకు ఒప్పందం చేసుకోలేదని ప్రశ్నించారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు, సర్వేలు, భూసేకరణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6,116 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. తుమ్మిడిహట్టి సాధ్యం కాదని తెలిశాకే.. బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టును రీ డిజైన్ చేసిందని.. కేంద్రం అనుమతులతోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విచారణకు కమిటీ వేయకుండా మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు.

తాము కాళేశ్వరానికి జాతీయ హోదా అడగలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడడం సిగుచేటని మండిపడ్డారు. దేశంలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ అంచనాలు పెంచుకోకుండానే పూర్తయ్యిందా..? అని ప్రశ్నించారు. దీనిపై ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 141 టిఎంసిలు నీటిని చిల్వ చేసేలా రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందని చెప్పారు.

కేబినెట్ ఆమోదంతో ల్యాండ్ క్రూజర్స్ కొనడంలో తప్పేముంది?
ల్యాండ్ క్రూజర్లపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను కడియం శ్రీహరి తప్పుపట్టారు. రాష్ట్ర కేబినెట్ ఆమోదంతో ల్యాండ్ క్రూజర్స్ కొనడంలో తప్పేముందని ప్రశ్నించారు. ల్యాండ్ క్రూజర్స్ వచ్చిన తర్వాత వాటిని ప్రభుత్వం వాడుకోదా..? వాటిని అమ్మేస్తారా..? అని నిలదీశారు. అందులో ఏమైనా అవినీతి జరిగిందా..? అంటూ ప్రశ్నించారు. ప్రగతి భవన్‌ను హాస్పిటల్ చేస్తామన్నారని.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని అందులోనే ఉంటున్నారని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్‌కు లంకె బిందెల కోసం వస్తారా..? అంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి బాధ్యతగా మాట్లాడాలని కడియం శ్రీహరి హితవు పలికారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News