Sunday, December 22, 2024

కాంగ్రెస్ ప్రభుత్వం బిసి వ్యతిరేకతను చాటుకుంది

- Advertisement -
- Advertisement -

యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం తన బిసి వ్యతిరేకతను బడ్జెట్ ద్వారా చాటుకుందని యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ రావు ధ్వజమెత్తారు. మధ్యంతర బడ్జెట్‌లో బిసిలకు తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ చరిత్రలోనే బిసి వ్యతిరేక విధానం ఉందని మరోసారి రుజువయ్యిందని స్పష్టం చేశారు. ఆదివారం నాడు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో యుపిఎఫ్ నాయకులతో కలిసిగట్టు రామచందర్ రావుతో మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో బిసిలకు రూ. లక్ష కోట్లు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన డిక్లరేషన్‌లో హామీ ఇచ్చిందని, కానీ ఈ సారి కేవలం రూ. 8 వేల కోట్లు మాత్రమే కేటాయించారని ఎండగట్టారు. ఈ లెక్కన ఐదేళ్లలో కేవలం రూ. 40 వేల కేటాయింపులే చేసే అవకాశం ఉందని, మిగితా రూ. 60 వేల కోట్లు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. బిసి డిక్లరేషన్‌ను ఒక టిష్యూ పేపర్‌గా పక్కనపెట్టారని అన్నారు. బిసి డిక్లరేషన్‌లో పొందుపరిచిన అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు నెలల్లో కులగణన పూర్తి చేసి స్థానిక సంస్థల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని స్పష్టం చేశారు.
మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టడమే ఒక కుట్ర : తాడూరి శ్రీనివాస్
మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టడమే ఒక కుట్ర అని యుపిఎఫ్ కో- కన్వీనర్ తాడూరి శ్రీనివాస్ ఆరోపించారు.బిసిలకు, ఎంబిసిలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. బిసిలకు విపరీతమైన హామీలు ఇచ్చి ఇప్పుడు బడ్జెట్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం బిసిలను అవహేళన చేసిందని మండిపడ్డారు. కో- కన్వీనర్ రాజారాం యాదవ్ మాట్లాడుతూ… జ్యోతిరావు పూలే సబ్ ప్లాన్‌కు ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎంబిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో ప్రకటించాలని స్పష్టం చేశారు.

కో కన్వీనర్ బొల్ల శివ శంకర్ మాట్లాడుతూ…కాంగ్రెస్ కల్లిబొల్లి మాటలు చెప్పి బిసిలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిసిలు కాంగ్రెస్ పార్టీకి తగ్గిదా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బిసిల పట్ల వ్యతిరేకతను మానుకోవాలని సూచించారు. బిసిలకు తొలి బడ్జెట్‌లోనే అన్యాయం చేయడం దారుణమని అన్నారు. బిసిల పట్ల కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేదని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో యుపిఎఫ్ నాయకులు కోల శ్రీనివాస్, నాగేందర్ గౌడ్, ఆర్.వి.మహేందర్ కుమార్, ఆలకుంట హరి, గీతా గౌడ్, ఏల్చల దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు.

UPF 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News