Friday, December 20, 2024

సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -

వీలైనంత త్వరగా దవాఖానలు ప్రజలకు అందుబాటులోకి తేవాలని
వైద్య సేవలు అందించేందుకు టెక్నికల్ కమిటీ నియమించాలి
రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ

మన తెలంగాణ/హైదరాబాద్:  రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులకు సూచించారు. గురువారం డా. బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో వైద్య, ఆరోగ్య శాఖల ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వరంగల్ లో 2100 పడకల , నగరంలోని అల్వాల్ లో నిర్మిస్తున్న 1200 బెడ్స్, ఎల్బీనగర్‌లో నిర్మిస్తున్న 1000 పడకలు, సనత్ నగర్‌లో నిర్మిస్తున్న వెయ్యి పడకల సామర్థ్యం కలిగిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనుల పురోగతితో పాటు ఎర్రమంజిల్‌లోని నిమ్స్ ఆసుపత్రి 2వేల బెడ్స్ సామర్ధ్యంతో నిర్మిస్తున్న విస్తరణ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న ఆర్ అండ్ బి శాఖ ఇంజనీరింగ్ అధికారులతో పనులపై చర్చించారు.

ఈసందర్భంగా ఆయన నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే తక్షణం ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. వివిధ జిల్లాల నుండి హైదరాబాద్ నగరానికి మెరుగైన వైద్య సేవల కోసం వచ్చే రోగులకు అందించే చికిత్సలపై టెక్నికల్ కమిటీని నియమించాలని పేర్కొన్నారు. టెక్నికల్ కమిటీ సూచించిన విధంగా ఆయా ఆస్పత్రులలో స్పెషాలిటీ సేవలను, చికిత్సలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య శాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా చోoగ్తు, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్లు డా. వాణి, డా. శివరాం ప్రసాద్, వైద్య శాఖ ఉన్నతాధికారులు, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News