రెండోదశ ట్రయల్స్ డేటా నిరూపణ
న్యూఢిల్లీ : కరోనా నివారణకు స్వదేశీయంగా భారత్‌లో తయారైన మొదటి వ్యాక్సిన్ కొవాగ్జిన్ ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా రోగులకు రక్షణ కల్పించడమే కాకుండా వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపిస్తుందని లాన్సెట్ ఇన్పెక్సియస్ డిసీజెస్ జర్నల్ వెల్లడించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసిఎంఆర్), పుణె కేంద్రమైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవి) సహకారంతో భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. భారత్ ఔషధ నియంత్రణ మండలి దీన్ని అత్యవసర వినియోగానికి అనుమతించడంతో మొదట నిపుణులు అభ్యంతరాలు తెలియచేశారు. అయితే మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఈ వ్యాక్సిన్ 81 శాతం సమర్థత చూపిస్తోందని భారత్ బయోటెక్ ప్రకటించిన వారం తరువాత ఈ తాజా అధ్యయనం వెలుగు లోకి వచ్చింది. ఈ ఫలితాలు ఇంకా ప్రచురణ కావలసి ఉంది. రెండో దశ ట్రయల్ దేశం లోని తొమ్మిది రాస్ట్రాలోని 9 ఆస్పత్రుల్లో 12 నుంచి 65 ఏళ్ల వారిపై నిర్వహించారు.