Thursday, January 2, 2025

ప్రజావాణికి పోటెత్తిన జనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రజాభవన్‌లో ప్రజావాణి కార్యక్రమానికి ప్రజలు పోటెత్తారు. మంగళవారం ఉదయం నుంచే ప్రజలు పెద్ద సంఖ్య లో తరలివచ్చి తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు అందజేశారు. మరోవైపు జూనియర్ లైన్‌మెన్‌లకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు ప్రజాభవన్ ఎదుట తమ నిరసనను తెలిపారు. ప్రగతి భవన్ కాస్తా ప్రజాభవన్‌గా మారిన సంగతి విదితమే. ప్రజాభవన్‌ను మహాత్మా జ్యోతిరావే పూలే భవన్‌గా మార్చారు. ఈ మేరకు కొత్త బోర్డును సైతం ఏర్పాటు చేశారు.

ప్రధానంగా ల్యాండ్ సమస్యలపై ప్రజావాణికి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో వినతులు అందాయి. ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ ప్రజాభవన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజావాణిలో తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలంతా ప్రజాభవన్‌కు తరలివస్తూ ప్రజావాణిలో తమ వినతులను అందజేస్తున్నారు. ప్రజావాణికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్న దరిమిలా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగని రీతిలో అధికారులు ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యంతో సహా ఇతరత్రా సౌకర్యాలు కల్పించారు. వృద్ధులు, వికలాంగులకు అసౌకర్యం కలగని రీతిలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. నానాటికి ప్రజావాణికి ప్రజా స్పందన లభిస్తుండటంతో ప్రజలను క్యూలైన్ ద్వారా ప్రజావాణికి చేర్చడంలోనూ మరోవైపు ట్రాఫిక్ జామ్ అవ్వకుండా పోలీసు సిబ్బంది శక్తివంచన లేకుండా కృషి చేశారు. అయితే ప్రజావాణి ప్రారంభం నుంచి నేటి వరకూ దాదాపు 30 వేలకు పైగా దరఖాస్తులు అందాయని అధి కార వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రజాభవన్‌లో దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికీ తమ అర్జీ స్టేటస్‌ను సైతం తెలుసుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ల్యాండ్ సమస్యలపై అర్జీలు దాఖలవ్వగా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, పింఛన్లు, తదితరాలపై సైతం ప్రజలు అర్జీలు సమర్పించినట్లుగా తెలుస్తోంది. ఇంకోవైపు ధరణి సమస్యలపై సైతం ప్రజావాణిలో దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News