వివాహం చేసుకుంటానని
రూ.40లక్షలు దోచుకున్న నిందితురాలు
మనతెలంగాణ, సిటిబ్యూరోః పెళ్లి పేరుతో బ్యాంక్ మేనేజర్‌ను నిండా ముంచింది సైబర్ లేడి. వివాహం చేసుకుంటానని నమ్మించి దశల వారీగా బాధితుడి నుంచి రూ.40లక్షలు తీసుకుని మోహం చాటేసింది. దీంతో బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం…. నగరంలోని కోఠిలో ఉన్న ఓ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న వ్యక్తి వివాహం కోసం మ్యాట్రిమోనియల్ సైట్‌లో వివరాలు నమోదు చేశాడు. దానిని చూసిన ముంబాయికి చెందిన ఓ కిలాడీ లేడి మేనేజర్ నచ్చారంటూ బుట్టలో పడేసింది.
రోజు ఇద్దరు గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుకునేవారు. రోజు మాట్లాడి మేనేజర్‌ను ట్రాప్‌లో పడేసింది. ఈ క్రమంలోనే మేనేజర్ తాను మళను కలవడానికి ముంబాయికి వస్తానని చెప్పాడు. దీంతో తన తల్లి ఆరోగ్యం బాగాలేదని ఆస్పత్రిలో ఉన్నానని చెప్పింది. దీంతో ఒక్కసారిగా కరిగి పోయిన మేనేజర్ కిలాడీ లేడీ చెప్పినట్లు చేశాడు. తన వద్ద డబ్బులు లేవని తర్వాత ఇస్తానని డబ్బులు ఉంటే పంపిచాలని కోరింది. ఈ మాటలు నిజమని నమ్మిన మేనేజర్ దశల వారీగా రూ.40లక్షలు ఆన్‌లైన్‌లో పంపించాడు. తర్వత కొద్ది రోజులకు లేడి ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో బాధితుడు తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.