Saturday, November 23, 2024

‘111పై’ నిర్ణయం ఇప్పుడే తీసుకోలేం

- Advertisement -
- Advertisement -

The decision on 111 cannot be taken now

హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటోంది, పరిసర ప్రాంతాల ప్రజల భవిష్యత్ దృష్ట్యా జలాశయాల రక్షణ, పచ్చదనం, అభివృద్ధి, రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు సిఎం కెసిఆర్ ఆదేశం, ఇందుచేత జిఒ 111పై నిర్ణయం తీసుకోవడానికి సమయం పట్టే అవకాశం
జిఒ 111 పరిధిలో 84 గ్రామాలు, లక్షా32వేల ఎకరాల భూమి, 538 చ.కి.మీ. విస్తీర్ణం ఉన్నదని అధికారుల వివరణ

మన తెలంగాణ/ హైదరాబాద్ : అంతర్జాతీయ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల ప్రజల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని జలాశయాల రక్షణ, అటవీ ప్రాంతాల్లో పచ్చదనం అభివృద్ధి, రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులను ఆదేశించారు. జీవో 111పై ప్రభుత్వం నిర్ణయం  తీసుకోవడానికి సమయం పట్టే అవకాశముందన్నారు. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధిపై మున్సిపల్ శాఖ అధికారులతో ఆదివారం ప్రగతిభవన్‌లో సమీక్ష జరిగింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 1 లక్ష ఎకరాల అటవీ భూమిని రక్షించడంతోపాటు, అందులో పచ్చదనాన్ని పెంచడానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 11 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు, కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్లలో నీటి నిల్వ ద్వారా నగరంలోని వాతావరణ పరిస్థితుల సమతూకాన్ని పాటించాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. జీవో నం. 111పై చర్చ సందర్భంగా… ఈ జీవో పరిధిలోని 84 గ్రామాల విస్తీర్ణం, 1 లక్షా 32 వేల ఎకరాల భూమి 538 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నదని, ఇది సుమారు జిహెచ్‌ఎంసి విస్తరించి ఉన్న ప్రాంతానికి సరిసమానమని అధికారులు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు.

రాబోయే తరాలకు మంచి నగరంగా అందిద్దాం

హైదరాబాద్‌కు అనుబంధంగా, హెచ్‌ఎండిఎ పరిధిలో విస్తరిస్తున్న ప్రాంతం.. ఇంకొక కొత్త నగరానికి సమానంగా వైశాల్యం ఉన్నందున, ఇంత పెద్ద ప్రాంతాన్ని నిబంధనలకు అనుగుణంగా రూపుదిద్దకపోతే జలాశయాలు, ప్రజలు నివసించే ప్రాంతాలు కాలుష్యం బారిన పడే ప్రమాదం ఉంటుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పటినుండే సమగ్ర ప్రణాళికల ద్వారా గ్రీన్ జోన్లు, సివరేజ్ మాస్టర్ ప్లాన్, తాగునీటి వ్యవస్థ, విశాలమైన రోడ్లు తదితర సదుపాయాలతో రాబోయే తరాలకు మంచి నగరం ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఉన్న అటవీ ప్రాంతాలను బలోపేతం చేస్తూ, జలాశయాలన్నింటినీ పరిరక్షిస్తూ, ఒక చక్కని ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సిఎం సూచించారు.

అస్తవ్యస్తంగా అభివృద్ధి చెందితే జలాశయాలు కాలుష్యపూరితమై ఇప్పటికే ఉన్న హైదరాబాద్ నగరాన్ని కూడా ప్రభావితం చేస్తుందని అలాగే, రాబోయే తరాలకు కూడా నియంత్రిత విధానంలో జరిగే సమతుల అభివృద్ధి కోసం పూర్తి ప్రణాళికలు రచించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సమగ్రమైన చర్చ, నిర్దిష్టమైన ప్రణాళికల ద్వారా జీవో 111పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుంది కాబట్టి, కోర్టును ఇంకా కొంత వ్యవధి కోరాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ , ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే జి.విఠల్ రెడ్డి, సిఎస్ సోమేశ్‌కుమార్ , సిఎం ఓ అధికారులు నర్సింగ్ రావు, స్మితాసబర్వాల్ రాజశేఖర్ రెడ్డి, ఆర్ధికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News