సిఎం రేవంత్ రెడ్డికి ఫార్మా రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్: ఎన్నికలలో ఫార్మా రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని ఫార్మా రద్దు చేసి చోట పెద్ద టౌన్ షిప్ ఏర్పాటు చేయబోతున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. దీంతో వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడేందుకు ప్రజలు కృషి చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కట్టుబడి పని చేస్తున్నారని వెల్లడించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసేందుకు కృషి చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన పని చేస్తుందని చెప్పారు.
అక్టోబర్‌లో కేంద్రం ప్రభుత్వం ముచ్చర్ల ఫార్మా సిటీ పేరుతో 20 వేల ఎకరాల భూమి సేకరణ కోసం పని చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కూడా ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పినట్లు గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ రద్దు చేసి అక్కడ నుంచి తరలిస్తామని చెప్పారని, ఫార్మా రైతులు, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, కల్వకుర్తి నియోజక వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈసందర్భంగా సిఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎంగా బులెట్ స్పీడ్ తో పని చేస్తున్నారని, 6 ఏళ్లుగా ప్రజలు చేస్తున్న పోరాటాలు నేడు ఫలించినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులను చూసి ప్రతిపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన, గిరిజనుల పక్షాన ఉందని, ప్రజలు ప్రభుత్వానికి సంపూర్ణంగా అండగా ఉన్నారని తెలిపారు.