Sunday, November 24, 2024

ఆ పార్టీల డిఎన్‌ఎ ఒక్కటే.. : బిజెపి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో బిజెపి ఎదగకుండా కుట్ర చేస్తున్న పిసిసి అధ్యక్షులు, సిఎం కెసిఆర్‌లకు గురువు.. పొరుగు రాష్ట్రం నాయకుడే. ఇద్దరి డిఎన్‌ఏ టెస్ట్ చేస్తే అది బయటపడుతుందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ ఎన్.రామచంద్రరావు ఆరోపించారు. మంగళవారం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. అందులో భాగంగా ఈ నెల 8న వరంగల్ పలు కార్యక్రమాలకు ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాకుండా చేసే యత్నంలో భాగమే కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో 30 వేల పోలింగ్ బూత్ లలో కార్నర్ సమావేశాలతో పాటు మహా జన్ సంపర్క్ అభియాన్ పేరుతో 70 లక్షల కుటుంబాలను కలిసి మోడీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమ పథకాలను వివరించామని వెల్లడించారు.బండి సంజయ్ ఆధ్వర్యంలో బిజెపి గ్రాఫ్ పెరుగుతుంటే తట్టుకోలేక దుష్ప్రచారం చేశారని విమర్శించారు.

కర్నాటక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ప్రజలు, కార్యకర్తలెవరూ మీడియాలో వస్తున్న కథనాలు, రెండు పార్టీల దుష్ప్రచారాన్ని పట్టించుకోకుండా తిప్పికొట్టాలని ఆయన కోరారు. ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ బిజెపిలో ఏదో జరుగుతోందని మీడియాలో పతాక శీర్షికలతో వార్తలను ప్రచురించడం బాధాకరం అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బిజెపి చాపకింద నీరులా ప్రజల్లోకి వెళుతూ కార్యక్రమాలు చేపడుతూ వారికి చేరువ అవుతోందన్నారు. వ్యాగన్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటకు స్థలం ఇవ్వాలని పదేపదే మొత్తుకున్న, బడ్జెట్‌లో నిధులు కేటాయించినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సానుకూలంగా స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. పార్టీ క్రమశిక్షణకు నిదర్శనం. పార్టీలో అంతర్గత అంశాలను మీడియాతో మాట్లాడే సంస్కృతి సరికాదన్నారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వేలాది మంది కార్యకర్తల త్యాగాల పునాదులపై ఏర్పడ్డ పార్టీ. నమ్మిన సిద్ధాంతం కోసం అమరులయ్యారు. అధికారం కోసమే కాకుండా సిద్ధాంతాలే ప్రాతిపదికగా లక్షలాది మంది కార్యకర్తలు పనిచేస్తున్నారని వెల్లడించారు. చిట్‌చాట్ , ఆఫ్ ది రికార్డ్ పేరుతో వస్తున్న వార్తలు బిజెపి కార్యకర్తలను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఏ నాయకుడైనా సరే… క్రమశిక్షణకు లోబడి ఉండాల్సిందే. నాలుగు గోడల మధ్య, పెద్దలతో చర్చించాల్సిన అంశాలపై మీడియాకు ఎక్కడం వెనుక ఆంతర్యమేంది? పదవుల కోసం ఎవరినైనా కలవచ్చు.. కానీ పార్టీని దెబ్బతీసే కుట్ర చేస్తే సహించేది లేదన్నారు. వ్యక్తులే ముఖ్యమనే వాళ్లకు పార్టీలో స్థానం ఉండదన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News