Friday, November 15, 2024

వందపడకల ఏరియా ఆసుపత్రి కల నెరవేరింది : హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

కేపీహెచ్‌బి: కూకట్‌పల్లి ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని కెసిఆర్ ప్రభుత్వం సాకారం చేసిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం ఉదయం కేపీహెచ్‌బి 5వఫేజ్‌లో హుడా లేఅవుట్ ప్రకారం కేటాయించిన ఎకరంన్నర స్థలంలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి నిర్మాణానికి మంత్రి హరీష్‌రావు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎంఎల్‌సీ నవీన్‌రావులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్ళుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పట్టుబట్టి ముఖ్యమంత్రి కెసిఆర్‌ను తనను ఒప్పించి ఆసుపత్రిని మంజూరు చేసుకున్నారని తెలిపారు. ఈ ఆసుపత్రిని రానున్న 9నెలలలోపు నిర్మాణాన్ని పూర్తిచేసి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి చెప్పారు. వంద పడకల ఏరియా ఆసుపత్రి అందుబాటులోకి వస్తే 35మంది డాక్టర్లు, 89మంది సిబ్బంది వైద్య సేవలు అందిస్తారని తెలిపారు. కూకట్‌పల్లి పక్కనే ఉన్న ఎర్రగడ్డలో వెయ్యిపడకలతో సూపర్ స్పెషాలిటీ సేవలతో టిమ్స్ అసుపత్రి నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారని, పనులు వేగంగా జరుగుతున్నాయని కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందుతాయని మంత్రి హరీష్‌రావు తెలిపారు.

పక్కనే ఉన్న పటాన్ చెరువులో కూడా 200 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని గుర్తు చేశారు. గతంలో ప్రభుత్వ దవాఖానాలు సమస్యలకు నిలయంగా ఉండేవని నేడు దేశంలో ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గతంలో రాష్ట్రంలో మూడు మెడికల్ కళాశాలలు ఉంటే నేడు 33 మెడికల్ కళాశాలలు నెలకొల్పి కొత్త డాక్టర్లను తయారు చేస్తున్నామని వివరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి నిత్యం పేదల గురించి ఆలోచించే గొప్ప నాయకుడు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అని కొనియాడారు.

తన కోసం తాను ఏమి కోరక పోయినా ప్రతినిత్యం ప్రజల గురించి ఆలోచించే నాయకుడు దొరకడం ఈ ప్రాంత వాసులు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు. తల్లిగర్బ దాల్చిన దగ్గర నుంచి కళ్యాణ లక్ష్మీ పథకం అందించే వరకు అడుగుడగునా ప్రభుత్వం పేదలకు చేయుతనందిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలు దేశంలో ఎక్కడైనా ఉన్నాయో చూసి రావాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్‌రావుల సహకారంతో కూకట్‌పల్లి నియోజకవర్గంలో వంద పడకల ఏరియా ఆసుపత్రిని మంజూరు చేయించినట్లు చెప్పారు.

దీంతో ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నట్లైందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎంఎల్‌సీ శంభీపూర్‌రాజు, బీఆర్‌ఎస్ నియోజకవర్గం కో ఆర్డినేటర్ సతీష్ అరోరా, కార్పొరేటర్లు మందాడి శ్రీనివాస్‌రావు, పగుడాల శిరీషాబాబూరావు, జూపల్లి స్యతనారాయణ, మహేశ్వరీ, సబియాగౌసుద్దీన్, తూము శ్రావణ్, సతీష్‌గౌడ్, డివిజన్‌ల అధ్యక్షులు కృష్ణారెడ్డి, ప్రభాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News