Wednesday, January 22, 2025

డ్రగ్స్ కంటైనర్ చంద్రబాబు బంధువులదే!

- Advertisement -
- Advertisement -

విశాఖ డ్రగ్స్ కేసులో దొంగే దొంగ అన్నట్లుగా చంద్రబాబు అండ్ కో అరుపులు
సాక్షాత్తు పురందేశ్వరి కొడుకు కూడా ఆ కంపెనీలో భాగస్వామే!

పట్టుబడిన డ్రగ్స్ వెనుక చంద్రబాబు, పురందేశ్వరి గ్యాంగ్ లు
సీబీఐతో పాటు సంబంధిత సంస్థలకూ ఫిర్యాదు చేస్తాం
తప్పుడు రాతలపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తాం
ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : డ్రగ్స్ కంటైనర్ చంద్రబాబు నాయుడు బంధువులదే అని ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు.శుక్రవారం తాడేపల్లి వైసిపి కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. తాము ఏం మాట్లాడుతున్నాం అనే ఇంగితం చంద్రబాబూకు ఉండాలన్నారు.టీడీపీ వారి అరుపులే నిజాలైపోతే, ఆ పార్టీ చెప్పే అబద్ధాలన్నీ కూడా నిజాలైపోతాయన్నారు.గాల్లోంచి తీసి కల్పితాలను కూడా నిజాలుగా వారు చిత్రీకరించగల సమర్దులని ఆరోపించారు.గుమ్మడికాయ దొంగెవరూ భుజాలు తడుముకుంటున్న చందాన దొంగే దొంగ దొంగ అని అరుచుకుంటూ వెళ్తున్నారన్నారు. వైజాగ్ డ్రగ్స్ కేసు సినీ ఫక్కీలో పట్టుబడిందని, సీబీఐ దాన్ని పట్టికుందన్నారు. ఓ వైపు విచారణ జరుగుతోందని,  ఈ నేపథ్యంలో టీడీపీ వారి పైత్యం విపరీతంగా మారిపోతోందన్నారు.నేరుగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకునే లోకేశ్‌లు కూడా ట్వీట్‌లు పెట్టడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

అసలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. మళ్లీ ముఖ్యమంత్రి కావాలని తాపత్రయపడుతున్నాడని, మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనే ఇంగితం ఉండాలి కదా అని ప్రశ్నించారు. జరిగిన విషయంలో వాస్తవాలు ఏంటి? అనేది అంత అనుభవం ఉన్న వ్యక్తి ఆలోచించుకోవాలి కదా అని నిలదీశారు. భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారని , అది దేశంలోకి వచ్చి ఉంటే భయంకరంగా ఉండేదని పట్టుకోవడం ఓ పెద్ద రిలీఫ్ అని తెలిపారు.టిడిపి వారు అరిచే అరుపులు చూస్తుంటే వీళ్లే దాని వెనుక ఉన్నారేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. పోనీ ఆ కంపెనీ చరిత్ర తీస్తే అంతా వారి కుటుంబాలకు దగ్గరగా ఉండే బంధువులు ఉన్నారని తెలిపారు. సాక్షాత్తు పురందేశ్వరి కొడుకు కూడా వారి కంపెనీల్లో భాగస్వామిగా ఉన్నారన్నారు. ఆమె వియ్యంకుడు కూడా ఆ కంపెనీలో పార్టనర్‌గా ఉన్నారని, వాళ్లు ప్రమోట్ చేసిన కంపెనీ నుంచి తర్వాత డివైడ్ అయ్యారన్నారు.

ఇలాంటి నేపథ్యంలో మేం ఆరోపణ చేస్తే వాళ్లు సంజాయిషీ ఇచ్చుకోవాల్సింది పోయి ఉల్టా మాపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కచ్చితంగా టీడీపీ వారి ప్రమేయం ఉందని తమ అనుమానం అన్నారు.ఎన్నికలకు వెళ్తున్న సమయంలో తమపై బండ వేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని, దానికి సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తోందన్నారు. ఒక్క ఈ విషయమే కాదు..ప్రతి ఒక్క దాంట్లో ఇలానే అర్ధం లేని ఆరోపణలు చేస్తూనే ఉన్నారన్నారని , దీనిలో కచ్చితంగా టీడీపీకి సంబందించిన వారి ప్రమోయం ఉందని తాము బలంగా అనుమానిస్తున్నామన్నారు. వాళ్ల ఉలికిపాటు చూస్తుంటే, దాన్ని తెచ్చి ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై నింద వేయాలని చూస్తుంటే వీళ్లు తప్పించుకోడానికే నింద వేస్తున్నారని అనిపిస్తోందన్నారు.
కచ్చితంగా దీని వెనుక చంద్రబాబు, ఆయన కొడుకు, ఆయన వదిన పురందేశ్వరి, వారి గ్యాంగ్ ఉన్నాయని తాము అనుమానిస్తున్నామన్నారు.
విచారణలో ఈ కోణం కూడా చూడాలని తాము సీబీఐకి పిటిషన్ పెడుతున్నామని, ఈ దిశలో కూడా విచారణ జరగాలని కోరుతున్నామన్నారు.
గంజాయి, డ్రగ్స్ క్యాపిటల్ అంటూ వారే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని తెలిపారు. గతంలో గంజాయి పండించి..టీడీపీ నాయకులే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని వందల కోట్లు సంపాదిస్తున్నారన్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి సాగును ధ్వంసం చేయడమే కాకుండా ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా చూపించామని తెలిపారు. దానిపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని మెచ్చుకుందని గుర్తు చేశారు. ఎస్‌ఈబీ పెట్టిన తర్వాత 12వేల ఎకరాల్లో సాగును ధ్వసం చేశారని తెలిపారు. ఇప్పుడు డ్రగ్ ఇంపోర్ట్ చేసుకున్న కంపెనీ తప్పుడు పనులు చేస్తే చర్యలు తీసుకుంది కూడా జగన్ ప్రభుత్వమే అని వెల్లడించారు. డ్రగ్స్ వాడకాన్ని తగ్గించడానికి, సాగు లేకుండా చేయడానికి కన్‌స్ట్రక్టివ్‌గా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలను మెచ్చుకోకపోగా..చంద్రబాబు,పవన్ కల్యాణ్‌లు తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో చెప్పుకోడానికి ఏమీ లేదు కాబట్టి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.థర్డ్ గ్రేడ్ కంటే హీనమైన వ్యక్తి లోకేశ్ అని విమర్శించారు.

ఈ డ్రగ్స్ కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలపై కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేస్తున్నామని వెల్లడించారు.థర్డ్ గ్రేడ్ కంటే హీనమైన స్థాయిలో లోకేశ్ ఉన్నాడని, ఎందుకు ట్వీట్ చేస్తున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా అతనికి అర్థం కావడం లేదన్నారు. మోకాలికి బట్టతలకు సంబంధం కట్టి ఎక్కడో బ్రెజిల్ దేశంతో సంబంధం కడుతున్నాడని ఆరోపించారు. ఎప్పుడో బ్రెజిల్ అధ్యక్షుడు గెలిచాడని విజయసాయి రెడ్డి ట్వీట్ చేస్తే దాన్ని పట్టుకొచ్చి ఈ కేసుకు అంటగడుతున్నారన్నారు. ఈ డ్రగ్స్ కేసులో ఎవరెవరూ ఉండే అవకాశం ఉంది అని చూస్తే సహజంగానే టిడిపికి చెందిన వారి దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులే కనిపిస్తున్నారని సందేహం వెలిబుచ్చారు.వీళ్లతో కలిసి ఎప్పుడూ తిరిగే వ్యక్తులు, ఆ కంపెనీ వారితో ఉన్న ఫోటోలు కూడా బయటకు వచ్చాయన్నారు. ఇది సహజంగానే వారిపైనే పడుతుంది. అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబుకు ఉంది కాబట్టి వారిపైనే అనుమానం ఉందన్నారు. అందుకే ఉల్టా మాపైనే ఆరోపణలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News