గ్రామసభల్లోనే గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపిక
28 నుంచి గ్రామసభల నిర్వహణ
రేషన్‌కార్డులు, పింఛన్లు, హౌసింగ్ లబ్ధిదారుల ఎంపిక అక్కడే.. అదేరోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ నుంచి పార్లమెంటుకు సోనియా పోటీ చేయాలని పిఎసిలో తీర్మానం
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల ఎంపిక
పార్లమెంట్ స్థానాలకు ఇన్‌చార్జీలుగా మంత్రుల నియామకం
పిఎసి సమావేశం వివరాలు వెల్లడించిన కన్వీనర్ షబ్బీర్ అలీ
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశామని కాంగ్రెస్ సీనియర్ నేత, పిఎసి కన్వీనర్ షబ్బీర్ అలీ తెలియజేశారు. కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం వివరాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ‘రాష్ట్రంలో గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించలేదని, బిఆర్‌ఎస్ హయాంలో అప్పుల వివరాలు అసెంబ్లీ వేదికగా ప్రకటిస్తామని మంత్రి భట్టి విక్రమార్క సభలో గత ప్రభుత్వ అప్పులపై ప్రజెంటేషన్ ఇస్తారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల అవకతవకలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేపట్టారని, ప్రాజెక్టుల్లో ఏం జరిగిందో ఆయన వివరిస్తారని తెలియజేశారు. ఈ నెల 28వ తేదీ (కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం) నుంచి గ్రామసభలు నిర్వహించి గ్యారెంటీ పథకాల అర్హులను ఎంపిక చేస్తామన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయాలని పిఎసిలో తీర్మానించామని, గతంలో ఇందిరాగాంధీ కూడా మెదక్ బరిలో నిలిచారని గుర్తుచేశారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ ఉంటుందని, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన చేస్తామని స్పష్టం చేశారు.
మహిళలకు రూ.2,500 భృతిపై…
మహిళలకు నెలకు రూ.2,500 భృతిపై ఈ నెల 28న చర్చించి నిర్ణయం తీసుకుంటామని షబ్బీర్ అలీ ప్రకటించారు. రూ.4 వేల పెన్షన్ అమలు, విధి విధానాలపై చర్చిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 28 నుంచి కొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ఇచ్చిన హామీ మేరకు 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులు, ఇంఛార్జీలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు చెబుతూ చేసిన తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్ కు ఒక్కో మంత్రికి ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు.
పార్లమెంట్ స్థానాల వారీగా వీరికే బాధ్యతలు
సీఎం రేవంత్ రెడ్డి – చేవెళ్ల, మహబూబ్ నగర్, భట్టి విక్రమార్క – సికింద్రాబాద్, హైదరాబాద్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి – ఖమ్మం, మహబూబాబాద్, ఉత్తమ్ కుమార్ రెడ్డి – నల్లగొండ, పొన్నం ప్రభాకర్ – కరీంనగర్, సీతక్క – ఆదిలాబాద్, శ్రీధర్ బాబు – పెద్దపల్లి, జీవన్ రెడ్డి – నిజామాబాద్, దామోదర రాజనర్సింహ – మెదక్, పి.సుదర్శన్ రెడ్డి – జహీరాబాద్, తుమ్మల నాగేశ్వరరావు – మల్కాజిగిరి, జూపల్లి కృష్ణారావు – నాగర్ కర్నూల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి – భువనగిరి, కొండా సురేఖ – వరంగల్.
పార్లమెంట్ నియోజకవర్గాల ఏఐసీసీ అబ్జర్వర్లు
వరంగల్వ్రీంద్ర దాల్వి, జహిరాబాద్‌మేయప్పన్, నాగర్‌కర్నూలు-పీవీ మోహన్, ఖమ్మం-ఆరీఫ్ నసీంఖాన్, నల్లగొండ-రాజశేఖర్ పాటిల్, పెద్దపల్లి – మోహన్ జోషి, మల్కాజ్‌గిరి- రిజ్వాన్ అర్షద్, మెదక్-యూబీ వెంకటేశ్, సికింద్రాబాద్ – రూబీ మనోహరన్, హైదరాబాద్‌భాయ్ జగదప్, భువనగిరిశ్రీనివాస్, మహబూబాబాద్‌శివశంకర్‌రెడ్డి, ఆదిలాబాద్‌ప్రకాశ్ రాథోడ్, నిజామాబాద్‌అంజలీ నింబాల్కర్, మహబూబ్‌నగర్‌మోహన్ కుమార్ మంగళం, చేవెళ్లఎం.కె. విష్ణుప్రసాద్, కరీంనగర్‌క్రిష్టోఫర్ తిలక్ ఉన్నారు. అంతకుముం దు గాంధీభవన్‌లో సోమవారం నిర్వహించిన పిఎసి సమావేశం ఐదు అంశాల ఎజెండాగా సాగింది. ఎన్నికల ఫలితాలు, ఆరు గ్యారంటీల అమలు, నామినేటెడ్ పోస్టులు, పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై చర్చించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సీట్లు తగ్గడంపైనా సమాలోచనలు చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి పిఎసి సమావేశం కావడంతో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్‌రావు ఠాక్రే అధ్యక్షతన కొనసాగినఈ సమావేశంలో పిసిసి చీఫ్, సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంఎల్‌ఎ జగ్గారెడ్డి, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభలు పెట్టి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇస్తామని, వంద రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని సమావేశం తీర్మానించింది. అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. తెలంగాణ కాంగ్రెస్ గెలుపునకు కృషి చేసిన ఎఐసిసి నేతలకు ధన్యవాదాలు తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చాలా కష్టపడ్డారని మాణిక్‌రావ్ ఠాక్రే అభినందించారు. తమ పార్టీ విధానాలను, హామీలను ప్రజలు పూర్తిగా విశ్వసించారని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మంచి విజయం కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఈ క్రమంలోనే రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని సూచించారు. అంతకుముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, సంపూర్ణ మద్దతు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఎఐసిసి అగ్ర నేతలు, ప్రచారంలో పాల్గొన్న నాయకులు, ఇంఛార్జ్‌లుగా పని చేసిన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ ధన్యవాదాలు చెబుతూ తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని సమావేశంలో ఏకగ్రీగంగా ఆమోదించారు.