Friday, December 27, 2024

శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల కృషి భేష్

- Advertisement -
- Advertisement -
  • జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి

వికారాబాద్ : శాంతి భద్రతలు పరిరక్షించడంలో పోలీస్ శాఖ చేస్తున్న కృషి ఎంతో అమోఘమని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వికారాబాద్ పట్టణ కేంద్రంలో పోలీస్ శాఖ నేతృత్వంలో నిర్వహించిన తెలంగాణ రన్‌ను స్థానిక శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డిలు ఎన్టీఆర్ చౌరస్తాలో జెండా ఊపి ప్రారంభించారు.

తెలంగాణ రన్ లో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, యువకులు, విద్యార్థినీ విద్యార్థులు, పోలీస్, మున్సిపల్ సిబ్బంది, వాకర్స్, క్రీడాకారులు అతిథులతో కలిసి ఆలంపల్లి చౌరస్తా వరకు తెలంగాణ రన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పరుగెడుతూనే అభివృద్ధిలో దేశంలోనే ముందు వరుసలో ఉన్నామన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని దేనికోసమైతే ఏర్పాటు చేసుకున్నామో ఆ దిశగా ప్రయాణించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. పోలీస్ శాఖ అన్ని రంగాల్లో తమ సేవలను కొనసాగిస్తుందని ఆయన అన్నారు.

శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నప్పుడే రాష్ట్రంలో పెట్టుబడులకు ఎక్కువగా అవకాశం ఉంటుందని, ప్రస్తుతం రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడానికి మన రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా అమలు పరచడమేనని కలెక్టర్ అన్నారు. మంచి పనులు చేసే వారికి తమ సేవలను అందిస్తూ స్నేహపూరిత విధానాన్ని శిఖా పరంగా అమలు పరుస్తుందని ఆయన పేర్కొన్నారు. తప్పు చేసే వారికి మాత్రమే పోలీస్ వ్యవస్థ శత్రువుగా కనిపిస్తుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు ఎక్కడ చిన్న ఇబ్బంది జరిగిన ఒక్క ఫోన్ కాల్ తో షీ టీమ్ లు సమస్యను పరిష్కరిస్తున్నాయని తెలిపారు.

సాంకేతికతను వినియోగించుకొని ఎన్నో మోసాలకు గురవుతున్న సందర్భంలో వాటిని అరికడుతోనే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. వికారాబాద్ కేంద్రంలో ఈనెల 22న అమరుల స్మారకార్థం స్థూపాన్ని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజల సమక్షంలో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తెలంగాణ రన్ విజయవంతం చేసిన జిల్లా ఎస్పీ, పోలీస్ సిబ్బందితోపాటు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధిలో పోలీస్ శాఖ చాలా కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

రాష్ట్రాల నుండే కాకుండా ఇతర దేశాల నుండి పెట్టుబడులకు రావడం అంటే మన రాష్ట్రం పెట్టుబడులకు ఎంత సురక్షితమో చెప్పవచ్చన్నారు. రాష్ట్రంలో కొత్త ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం షీటీం అనే వినూత్న కార్యక్రమం చేపట్టి ఆపదలో ఉన్న మహిళలను పోలీస్ శాఖ ఆదుకుంటుందనే నమ్మకాన్ని కల్పించింది. నివారణ కంటే నిరోధన ఉత్తమం ( ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ ) అని భావించి ఆడపిల్లలకు పోలీస్ శాఖ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని భరోసా కేంద్రం ఏర్పాటు సమస్యల పరిష్కారం ముందుంటుందని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం మహిళల పట్ల తీసుకునే కార్యక్రమాలను వేరే రాష్ట్రాలు కూడా అనుసరించడం శుభ సూచికమని అన్నారు.

జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం అందరినీ కార్యోన్ముకులను చేసింది అన్నారు. సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన క్రమంలో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వారికి తిరిగి అందజేయడంలో టెక్నాలజీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అతి తక్కువ సమయంలో అక్కడికి చేరుకొని సహాయపడుతున్నట్లు ఆయన తెలిపారు. షీ టీం లను, భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆడపిల్లకు రక్షణగా నిలుస్తున్నామన్నారు. గ్రామాల్లో మూఢనమ్మకాలపై, ఆత్మహత్యలకు పాల్పడకుండా పోలీస్ కళా బృందాలచే అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ జరగకుండా కౌన్సిలింగ్ ద్వారా నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు.

ప్రజా ప్రతినిధులు, అధికారులు, పోలీస్ సిబ్బంది సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని పోలీస్ శాఖకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు, తెలంగాణ రన్ లో మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, మున్సిపల్ కమిషనర్ శరత్చంద్ర, రెవెన్యూ డివిజనల్ అధికారి విజయ కుమారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోపాల్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఉపేందర్, ఎంపీడీవో సత్తయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రన్ సందర్భంగా పాల్గొన్న వారిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రకటించి మెమొంటోలను అందజేశారు. తెలంగాణ సాంస్కృతి సారధి, పోలీస్ శాఖ కళాబృందాలు ఆలరించిన గేయాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News