లండన్: రాబోయే మాసాల్లో ఎల్‌నినో ప్రభావం తిరిగి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని, దీనివల్ల ఉష్ణ్ణోగ్రతలు పెరిగే ప్రమాదం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్లు ఎంఓ) అంచనా వేసింది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వర్షపాతాన్ని నిర్ణయించేవి పసిఫిక్ మహాసముద్రం ఉపరితలంనుంచే వీచే గాలులే. శీతల గాలులు ఏర్పడితే దాన్ని లా నినోగా, వేడి గాలులు ఏర్పడితే ఎల్ నినోగా నిపుణులు పేర్కొంటారు. గత మూడేళ్లగా లా నినో ప్రభావం కారణంగా వర్షాలు సమృద్ధిగా కురిశాయి. కొన్నిప్రాంతాల్లో అధిక వర్షపాతాలు సంభవించాయి. అయితే ఇప్పుడు లా నినో ప్రభావం చివరి దశకు వచ్చిందని, ఎల్‌నినో ప్రభావం ప్రారంభం అయ్యే అవకాశముందని డబ్లు ఎంఓ తన తాజా ప్రకటనలో తెలిపింది. ఎల్ నినో ప్రభావం ఈ ఏడాది మార్చి మే మధ్యకాలంలోప్రారంభమయ్యే అవకాశాలు దాదాపు 90 శాతం వరకు ఉండే అవకాశముందని ఆ ప్రకటన తెలిపింది.
ఆ తర్వాత ఈ పరిస్థితుల్లో స్వల్ప తగ్గుదల ఉండవచ్చని, అయితే తర్వాతి రోజుల్లో కూడా దీని ప్రభావం ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని ఆ ప్రకటన తెలిపింది. లా నినో కారణంగా ప్రపంచ ఉష్ణోగ్రతల పెరుగుదలకు తాత్కాలికంగా బ్రేక్ పడిందని డబ్లు ఎంఓ సెక్రటరీ జనరల్ పెట్టెరీ టాలస్ అన్నారు. ఎల్ నినో దశలోకి ప్రవేశించని పక్షంలో మరోసారి ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగడానికి అది దారి తీయవచ్చని ఆయన అన్నారు. కాగా ఎల్‌నినో ప్రభావం కారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం 2026 దాకా కొనసాగవచ్చని కూడా ప్రపంచ వాతావరణ సంస్థ అభిప్రాయపడింది. ఎల్‌నినో, లా నినోలు అనేవి సహజంగా జరిగే పరిణామాలే. అయితే మానవ కల్పిత వాతావరణమార్పుల నేపథ్యంలో ఇవి చోటు చేసుకొంటూ ఉండడంతో భూతాపం పెరిగిపోవడం, కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, వరదలు లాంటివి సంభవించడం చోటు చేసుకొంటున్నాయి. లా నినా దశ ముగింపునకు వచ్చినప్పటికీ దాని ప్రభావం మరికొంత కాలం ఉండే అవకాశముందని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.