Sunday, November 17, 2024

ఇద్దరి ఎన్నిక ఇక ఏకగ్రీవమే…

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పర్వం
కాంగ్రెస్ నుంచి నామినేషన్‌లను దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు
నేడు నామినేషన్ల పరిశీలన
22వ తేదీన అధికారికంగా ప్రకటన
పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు : మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగిసింది. రెండు స్థానాల కోసం ఇద్దరు అభ్యర్థులు (కాంగ్రెస్) నుంచి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. వేరే పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు వేయకపోవడంతో బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నామినేషన్ దాఖలుకు నేడు (గురువారం) ఆఖరి రోజు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థులు మహేష్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్లు నామినేషన్ పత్రాలు సమర్పించారు. నేడు నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఈనెల 22వ తేదీ వరకు నామినేషన్‌ల ఉప సంహరణకు గడువు ఉంది. అదే రోజున మధ్యాహ్నం మూడు గంటలకు అభ్యర్థుల ఎన్నికపై ప్రకటన వెలువడనుంది. అసెంబ్లీ కార్యదర్శికి తమ నామినేషన్ పత్రాలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అందజేశారు. వీరితోపాటు డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థుల బయోడేటా

1.పేరు : బల్మూరి వెంకట్/బల్మూరి వెంకట నర్సింగరావు

తండ్రి: మధన్‌మోహన్‌రావు. పుట్టిన తేదీ : నవంబర్ 2, 1992,
విద్యార్హత: ఎంబిబిఎస్ పుట్టిన ఊరు: తారుపల్లి, కాల్వ శ్రీరాంపూర్, పెద్దపల్లి జిల్లా, కులం : ఓసీ (వెలమ)
30 సంవత్సరాల 9 నెలల వయస్సు
ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్న బల్మూరి వెంకట్ అత్యంత చిన్న వయస్కుడు. 30 సంవత్సరాల 9 నెలల వయస్సు. వెంకట్ ఎన్‌ఎస్‌యూఐలో ఉత్సాహంగా పనిచేస్తూ వచ్చిన ఆయన, ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. పదేళ్లుగా కాంగ్రెస్ అధికారంలో లేకున్నా నిరంతరం యువత, విద్యార్థుల మధ్య ఉంటూ, వారి సమస్యలపై ఎన్నో పోరాటాలు చేశారు. కీలక అంశాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి గత ప్రభుత్వ తీరును ఎండగడుతూ వచ్చారు. పోలీసుల నిర్బంధాలు, కేసులను ఎదుర్కొంటూ వచ్చిన బల్మూరి కృషిని గుర్తించిన పార్టీ నాయకత్వం. చిన్న వయస్సులోనే పెద్దల సభలోకి పంపాలని నిర్ణయించింది.

2. పేరు: బొమ్మ మహేశ్‌ కుమార్ గౌడ్

తండ్రి: బి.గంగాధర్ గౌడ్ పుట్టిన తేదీ: ఫిబ్రవరి 24, 1966 విద్యార్హత: బికాం, పుట్టిన ఊరు: రహత్‌నగర్, భీంగల్ మండలం, నిజామాబాద్ జిల్లా కులం: బిసి (గౌడ).
విద్యార్థి దశ నుంచే కాంగ్రెస్‌లో పనిచేస్తున్న ఆయన అంచలంచెలుగా ఎదిగి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. 2014లో నిజామాబాద్ అర్బన్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోగా, ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించినా అవకాశం రాలేదు. ఈ సమయంలోనే ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామన్న హస్తం పార్టీ నాయకత్వం హామీ మేరకు మహేశ్‌కుమార్ గౌడ్ మండలికి ఎన్నికయ్యే అవకాశం లభించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News