Monday, December 23, 2024

గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి నిర్మాణ క్రెడిట్ సిఎం కెసిఆర్‌దే

- Advertisement -
- Advertisement -

హుస్నాబాద్: శివుని తలపై గంగమ్మ వలే హుస్నాబాద్ నియోజకవర్గానికి గౌరవెల్లి ప్రాజెక్టు నిలుస్తుందని, ప్రాజెక్ట్ పూర్తి నిర్మాణ క్రెడిట్ మొత్తం రాష్ట్ర సిఎం కెసిఆర్‌కే దక్కుతుందని సిద్దిపేట జిల్ల ప్రాజెక్టుల ఖిల్లా అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం హుస్నాబాద్ పోతారం (ఎస్) శుభం గార్డెన్‌లో నిర్వహించిన నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి దినోత్సవ సంబరాలలో ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత పాలకులు కేవలం 1.4 సామర్థ్యంతో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టును రాష్ట్రం ఏర్పడ్డాక సిఎం కెసిఆర్ స్వయంగా సందర్శించి ప్రాంత రైతుల అభివృద్ధి కోసం సామర్థ్యం పెంచడం జరిగిందని, త్వరలోనే ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలతో నింపనున్నట్లు వెల్లడించారు.హుస్నాబాద్‌కు జలహారం గౌరవెల్లి ప్రాజెక్టు అని అన్నారు.

ప్రాజెక్టు పూర్తితో సుమారు ఒక లక్ష 6వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని తద్వారా హుస్నాబాద్ ప్రాంతం సస్యశ్యామలంగా మారబోతుందని తెలిపారు. భూ నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని వారికి ఎంత చేసిన తక్కువే అని ప్రత్యేక శ్రద్ధతో సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో దాదాపు 700 చెరువులు, కుంటలకు జలకళతో నిండుకుండలా మారనున్నట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గంలో శనిగరం చెరువుతోపాటు సింగరాయ ప్రాజెక్టు మరమ్మతు పూర్తి చేసుకున్నామని తెలిపారు. ఎస్సారెస్పీ ద్వారా ఎల్కతుర్తి మండలానికి, దేవాదుల ద్వారా సైదాపూర్, చిగురు మామిడి మండలానికి, మిడ్ మానేరు ద్వారా మహమ్మదాపూర్ గ్రామంలో నిర్మించిన వాటర్ ట్యాంకు లకు నీరు అందుతుందని హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఇంటి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తున్నామని తెలిపారు.

అంతేకాకుండా సీఎం కేసీఆర్ మహాసముద్రం గండిని స్వయంగా సందర్శించి పనులకు శంకుస్థాపన చేసి పూడ్చడంతో సుమారు 14 గ్రామాలలో నీటిమట్టం పెరిగిందని అన్నారు. అనంతరం నీటిపారుదల శాఖ ప్రచురించిన మా తెలంగాణ కోటి ఎకరాల మాగాని, సాగునీటి రంగంలో ప్రగతి ప్రవాహం పుస్తకాలను ఆవిష్కరించారు. నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ అధికారులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్, టిఈఎస్ సిఓబి చైర్మన్ కొండూరి రవీందర్ రావు, సిద్దిపేట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజారెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ అయిలేని అనిత, ఎంపిపిలు లకావత్ మానస, లక్ష్మీ బిల్ నాయక్, కొక్కుల కీర్తి సురేష్, జడ్పిటిసి భూక్యమంగ, ఎఎంసి చైర్మన్ ఎడబోయిన రజిని, మాజీ ఎంపిపి ఆకుల వెంకట్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఎడబోయిన తిరుపతిరెడ్డి, మండల టిఆర్‌ఎస్ అధ్యక్షుడు వంగ వెంకట్రామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండి అన్వర్, వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్టి గోపాల్ రెడ్డి, పట్టణ కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, రైతు సంఘాలు నాయకులు, పలు మండలాల అధ్యక్షుడు, ప్రజాప్రతినిధులు, నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు రాములు, అమృతయ, నారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News