Monday, December 23, 2024

అయోధ్య బాలరాముడి నిజరూప దర్శనం

- Advertisement -
- Advertisement -

తొలి చిత్రాన్ని బహిర్గతం చేసిన ఆలయ అధికారులు

అయోధ్య: అయోధ్య రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి మరో మూడు రోజుల ముందు ఆలయం ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహ రూపం శుక్రవారం భక్తులకు సంపూర్ణంగా దర్శనమిచ్చింది. చేతులలో బంగారు ధనుస్సు, విల్లును ధరించి చిరునవ్వును చిందిస్తున్న ఐదేళ్ల వయసున్న బాలరాముడి విగ్రహం నిలుచున్న భంగిమలో భక్తులకు దర్శనమివ్వనున్నది. 51 అంగుళాలఎత్తున్న బాలరాముడి విగ్రహాన్ని మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ కృష్ణ శిలలో మలిచారు.

గురువారం నాడు ఆలయ గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించిన సందర్భంగా వస్త్రం కప్పిన విగ్రహం ఫోటోను ఆలయ అధికారులు మీడియాకు విడుదల చేశారు. శుక్రవారం ఉదయం విడుదల చేసిన మరో ఫోటోలో విగ్రహం కళ్లకు వస్త్రం కట్టి ఉంది. అయితే బాలరాముడి నిజరూప దర్శనంతో కూడిన ఫోటోలను ఆలయ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం బహిర్గతం చేశారు. కాగా&అయోధ్యలో జనవరి 22న జరిగే రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు శరవేగంతో జరుగుతున్నట్లు ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రాజేష్ పాఠక్ శుక్రవారం తెలిపారు.

ఆలయంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిందని, మౌలిక సదుపాయాలు, వైద్య సౌకర్యాలతోసహా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే సోమవారం(జనవరి 22) రామాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఆహ్వానం పంపిన 8,000 మందికిపైగా ఉన్న అతిథుల జాబితాలో అపర కుబేరుడు ముకేష్ అంబానీ, బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తదితరులు ఉన్నారు.

అయోధ్య ఆలయంలో ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన పూజాక్రతువు జనవరి 12న ప్రారంభమైంది. జనవరి 22న ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన పూజలను ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తారని వర్గాలు వెల్లడించాయి. ప్రాణ ప్రతిష్టకు సంబంధించిన ప్రధాన క్రతువును అయోధ్యకు చెందిన లక్ష్మీకాంత్ దీక్షత్ సారథ్యంలో అర్చకుల బృందం నిర్వహించనున్నది. జనవరి 22న సంగం రోజు సెలవును అనేక రాష్ట్రాలలోని ప్రభుత్వాలు, కార్పొరేషన్లు, బోర్డులు ఇప్పటికే ప్రకటించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News