ఆత్మకూరు : రైతు బాంధవుడు, రైతులను రాజులుగా చేయాలని దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ విడుదల చేసిన 11వ విడత రైతు బంధును రైతులు సద్వినియోగం చేసుకోవాలని బిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు రవి కుమార్ యాదవ్ కోరారు. ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుని రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తున్నారని అన్నారు.
రైతులకు ఉచిత విద్యుత్, రైతు బీమా, రైతు బంధుతో పాటు వారి సంక్షేమానికి వేల కోట్ల రూపాయలను మంజూరు చేసి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్‌కే దక్కిందన్నారు. ఇప్పటికి 11 విడతల్లో 72 వేల 910 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయంను అందించారని అన్నారు. 11వ విడతలో 7720.29 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. గత పాలనలో బీడు పడిన భూములకు సైతం సాగునీరు అందించి బీడు భూములను పంట పొలాలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని ఆయన అన్నారు. రైతులు పెట్టుబడి సాయాన్ని అందిపుచ్చుకుని తమ పొలాలను సాగు చేసుకోవాలని కోరారు.