సిఎం పదవే కాదు… బిసి డిమాండ్లు పరిష్కరించండి
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి బిసి సంఘాల డిమాండ్
మన తెలంగాణ / హైదరాబాద్ : బిసి బిల్లు లక్ష్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి పోరాటాన్ని ఉధృతం చేస్తామని జాతీయ బిసి సంక్షేమ సంఘం ప్రకటించింది. బిసిల ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తేబానికి ఉద్యమాన్ని బలోపేతం చేయనున్నట్లు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎంపి ఆర్. కృష్ణయ్య తెలిపారు. మంగళవారం జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల సీట్ల కేటాయింపులో అన్ని రాజకీయ పార్టీలు బిసిలకు అన్యాయం చేశాయని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిని బిసిలకు ఇస్తామని బిజెపి ప్రకటించిందని, ముఖ్యమంత్రి పదవేకాదు బిసి డిమాండ్లను పరిష్కరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బిసి రిజర్వషన్ బిల్లు ప్రవేశ పెట్టి బిజెపి ప్రభుత్వం బిసిలపై తమ చిత్తశుద్దిని చాటుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని బిసి వాదం బలంగా ఉందని గుర్తించిన బిజెపి బిసి సిఎం ప్రకటించిందని ఆయనన్నారు. అంగబలం – అర్ధ బలం ఉన్న సమర్థులైన బిసి నాయకులు చాలా నియోజకవర్గాలలో ఉన్నప్పటికీ వారికి టికెట్లు కేటాయించకుండా అన్ని పార్టీలు అన్యాయం చేశాయని విమర్శించారు. – ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు బిసిలకు కేటాయిస్తామని ఊరించి కాంగ్రెస్ పార్టీ ఆశాభంగం కలిగించిందన్నారు. బిజెపి పార్టీ బిసిలకు ముఖ్యమంత్రి పదవి ప్రకటించడంతోనే సరిపెట్టరాదని, ముఖ్యమంత్రి పదవి బిసి ఉద్యమంలో ఒక భాగం మాత్రమేనని ఆయనన్నారు. పార్లమెంటులో బిసి బిల్లు పెడితే చట్టసభలలో బిసిలకు 50 శాతం అసెంబ్లీ పార్లమెంటు స్థానాలు బిసిలకు రిజర్వు అవుతాయని కృష్ణయ్య తెలిపారు.
బిసి బిల్లు కోసం బిసి సంక్షేమ సంఘం గత 35 సంవత్సరాలుగా కొన్ని వేల ఉద్యమాలు, బహిరంగ సభలు నిర్వహించిందని తెలిపారు. బిజెపి కేంద్రంలో బిసిని ప్రధానమంత్రిని చేసిందని, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ప్రకటించింది, బిసిలు బిసి బిల్లు కోరడం తప్పలేదు. దీనిని బిసి వ్యతిరేక వైఖరిగా చిత్రీకరించడం బిజెపికి తగదని కృష్ణయ్య తెలిపారు. బిసి బిల్లు పెడితే 50 శాతం రిజర్వేషన్లు వస్తాయని, అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు రిజర్వేషన్‌ల ప్రకారం బిసిలకు సీట్లు కేటాయించాల్సి వస్తుందని కృష్ణయ్య తెలిపారు. బిసిలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి, ఏటా రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని కోరారు. మహిళా బిల్లు పెట్టినట్లు బి.సి బిల్లు పెట్టాలని కోరారు. బిసి బిల్లుకు మద్దతు ఇచ్చే పార్టీలకే మద్దతు ఇస్తామని కృష్ణయ్య తెలిపారు.
మహిళా రిజర్వేసన్స్‌లో బిసి మహిళలకు సబ్ కోటా పెట్టాలని డిమాండ్ చేశారు. బిసి మహిళలకు సబ్ కోటా కావాలంటే ముందు పార్లమెంట్ లో బిసి బిల్లు పెట్టాలన్నారు. ఇప్పుడు బిసి బిల్లు రాకపోతే ఇక ఎప్పుడూ రాదని, 30 సంవత్సరాల పోరాటం – వృదా అవుతుందన్నారు. జాతీయ స్థాయిలో స్కాలర్ షిప్ పథకం, ఫీజు రియింబర్స్ మెంట్ పథకం, గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళు, స్టడీ సర్కిల్స్, లాంటి పథకాలు బిసిలకు అమలు చేయాలని, ప్రతి కుటుంబానికి 10 లక్షల బిసి బందు పథకం ప్రవేశపెట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అనేక రాష్ట్రాలలో బిసి ముఖ్యమంత్రులు తమిళనాడులో స్టాలిన్, బిహార్ లో నితీష్ కుమార్, కర్ణాటకలో సిద్ధరామయ్య, మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహన్, రాజస్థాన్ లో అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గడ్ లో భూపేష్ బెగెల్ తదితరులు. బిసి వర్గానికి చెందిన వారని, బిహార్, తమిళనాడు లో రిజర్వేషన్లు పెంచారు. కానీ ఫీజు రీయింబర్స్ మెంట్, గురుకుల పాఠశాలలు, హాస్టళ్ళు పెట్టడం లేదన్నారు. బిసిల విద్య, ఉద్యోగ, ఆరోగ్య, రాజకీయ అభివృద్ధికి ఎజెండాతో ముందుకు పోవాలని కోరారు.