Monday, December 23, 2024

శ్రీలంక హాహాకారాలు

- Advertisement -
- Advertisement -

The financial crisis in Sri Lanka

తీవ్ర రూపం దాల్చిన ఆర్థిక సంక్షోభం
కోడిగుడ్డు ధర రూ.35, కేజీ ఉల్లి రూ.600
పెట్రోలు రూ.283, చికెన్ కిలో రూ.1000
చమురు కోసం లైనులో నిలబడి ఇద్దరు మృతి

కొలంబో : శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం అక్కడి ప్రజలను పీల్చి పిప్పిచేస్తోంది. రికార్డు స్థాయికి ద్రవ్యోల్బణం చేరుకోవడంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లంక రూపాయి విలువ డాలర్‌లో పోల్చిచే రూ. 275 కు చేరుకుంది. దీంతో రోజురోజుకు జన జీవనం భారంగా మారిపోతోంది శ్రీలంకలో నిత్యావసర ధరలు అమాంతం పెరిగాయి. పెట్రోల్ ధర లీటరకు రూ. 283కు చేరుకుంది. డీజిల్ ధర రూ. 220 పలుకుతోంది. వంట గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ. 1,359 చేరుకుంది. కాగా, వంట గ్యాస్ కొరతతో 90శాతం హోటళ్లు మూసుకుపోయాయి. గ్యాస్ ధరలు అమాంతం పెరగడంతో ప్రజలు కిరోసిన్ వాడుతున్నారు. ఇక కోడి గుడ్డు ధర రూ. 35, కిలో చికెన్ రూ.1000, కిలో ఉల్లి ధర రూ. 600, పాలపొడి ప్యాకెట్ ధర రూ. 250, టీ ధర రూ. 100కు చేరుకున్నాయి.

పెట్రోల్, డీజిల్ కోసం వరుసలో నిలుచున్న ఇద్దరు వ్యక్తులు ఆదివారం మృతిచెందినట్టు లంక పోలీసులు తెలిపారు. వీరు ఇంధనం కోసం లైన్‌లో నిలుచుకొని అస్వస్థతకు గురై చనిపోయినట్టు కొలంబోలో పోలీసు ప్రతినిధి నలిన్ తల్దువా పేర్కొన్నారు. మరోవైపు లంకేయులు విద్యుత్ కొరతను సైతం ఎదుర్కొంటున్నారు. ప్రతీ రోజూ కొన్ని గంటల పాటు కరెంటు సరఫరాను నిలిపివేస్తున్నట్టు సమాచారం.ముడి చమురు నిల్వలు అయిపోయిన తర్వాత శ్రీలంక తన ఏకైక ఇంధన శుద్ధి కర్మాగారంలో ఆదివారం కార్యకలాపాలను నిలిపివేసినట్లు పెట్రోలియం జనరల్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు అశోక రన్‌వాలా తెలిపారు. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News