Thursday, January 23, 2025

కొత్తగూడెం పట్టణ ప్రజల మంచినీటి కష్టాలను తీర్చాలి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణ ప్రజల మంచినీటి కష్టాలను తీర్చాలని సిపిఐ మున్సిపల్ పక్ష కౌన్సిలర్లు, నాయకులు, మహిళలు కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్థానిక బస్టాండ్ సెంటర్‌లో ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నుంచి ఖాళీ బిందెలతో, బ్రెష్‌లు చేతపట్టుకుని వినూత్నంగా నినాదాలు చేశారు. అదేవిధంగా కుండలను పగలగొట్టి కౌన్సెలర్లు స్నానాలు చేసి నిరసన తెలిపారు.

ఈ నిరసన దశలో వన్ టౌన్ పోలీసులకు సిపిఐ కౌన్సెలర్లు, నాయకులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ డిఈ, మేనేజర్, టిపివో, అధికారులు మునిసిపల్ కార్యాలయానికి చేరుకుని, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారి ఆందోళన ఆపేది లేదని నిరసన, నినాదాలు మార్మోగేలా మంచినీళ్లు ఇవ్వండి మహాప్రభు అంటూ సిపిఐ నాయకులు, మహిళలు అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా 23వ వార్డు కౌన్సెలర్ వై.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలు మంచినీళ్ల కోసం పడరాని కష్టాలు ఏళ్ల తరబడి పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎన్నిసార్లు మున్సిపల్ సమావేశాల్లో సిపిఐ పక్ష కౌన్సెలర్లు అధికారులకు విన్నవించిన నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, కిన్నెరసాని పైప్‌లైన్ల రిపేర్ల పేరుతో కోట్లు ఖర్చు పెడుతున్న ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాంగా కొత్తగూడెం ప్రజల గొంతులు ఎండుతున్నాయి తప్ప మంచినీళ్లు రావడం లేదని విమర్శించారు. ఎండాకాలంలో ప్రజలు మంచినీళ్ల కోసం మినరల్ వాటర్ ప్లాంట్లకు వెళ్లి డబ్బులు పెట్టి మంచినీళ్లు కొనే దుస్థితి కొత్తగూడెం ప్రజలకు దాపురించిందని అన్నారు. కిన్నెరసాని మంచినీళ్లు అందని రోజున ప్రత్యామ్నాయంగా మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించారు.

అనంతరం మున్సిపల్ మాజీ కమిషనర్, డిఈ నవీన్ కుమార్‌కు, మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ మరమ్మతులు పూర్తి చేశామని, పైప్ లైన్ పనులు త్వరలో టెండర్ పూర్తి చేసి పైప్‌లైన్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, ఫిల్టర్ బెడ్ రిపేర్లు, పూర్తి చేసి వార్డుకు రెండు బోర్లు ఏర్పాటు చేసి ప్రతీరోజు నీళ్లు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన మునిసిపల్ కౌన్సిలర్లు, నాయకులు ఆందోళన విరమించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ పక్ష కౌన్సిలర్లు కంచర్ల జమలయ్య, మాజీ కౌన్సిలర్ సిపిఐ మునిసిపల్ పక్ష సెక్రటరీ మునిగడప వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ మాచర్ల శ్రీనివాస్, ఏఐటియుసి పట్టణ కన్వీనర్ పిడుగు శ్రీనివాస్, కౌన్సిలర్లు భూక్యా శ్రీనివాస్, బోయిన విజయకుమార్, పద్మజ, సమైక్య, రాజకుమారి,వివిధ వార్డుల ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News