Sunday, December 22, 2024

రాజ్యాంగబద్ధ పాలనలోనే పేదలకు ప్రగతి ఫలాలు

- Advertisement -
- Advertisement -

నియంతృత్వ ధోరణులకు తెలంగాణ చరమగీతం

మన తెలంగాణ/హైదరాబాద్ : ఏ ప్రభుత్వ మైనా రాజ్యాంగస్ఫూర్తితో పనిచేసినప్పుడే అభివృ ద్ధి ఫలాలు ప్రజలకు అందుతాయని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆమె హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం మాట్లాడారు. రూ.2 లక్షల రుణమాఫీ అంశంపై తెలంగాణ బ్యాంకర్లతో చర్చలు జరుపుతున్నదని గవర్నర్ తెలియ జేశారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. నియంతృత్వ ధోరణికి తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారని చెప్పారు.

అంతకుముందు గవర్నర్ పబ్లిక్ గార్డెన్స్‌కు చేరుకున్న సిఎం రేవంత్ రెడ్డి, సిఎస్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశం, భిన్న జాతులు, మతాలు, కులాల సమహారమని తెలంగాణ గవర్నర్ తమిళిసై చెప్పారు. కానీ రాజ్యాంగం అందరినీ ఏకం చేసిందని చెప్పారు. ఒకే జాతిగా నిలబెట్టిందని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం బడుగుల జీవితాల్లో వెలుగులు నిపేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. రాజ్యాంగం చూపిన బాటలో ముందుకు వెళ్తుందని తెలిపారు. పాలకులు ఎవరూ కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని గవర్నర్ అన్నారు. ప్రజలు పోరాటాలు, తీర్పుల ద్వారా అధికారాన్ని కూడా కంట్రోల్ చేయగలరని తెలిపారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆమె అన్నారు. గత పదేళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని అన్నారు. నియంతృత్వ ధోరణితో ముందుకు సాగాడాన్ని తెలంగాణ ప్రజలు సహించబోరని తెలిపారు. అందుకే ఎన్నికల తీర్పుతో దానికి చరమగీతం పాడారని గవర్నర్ తమిళిసై అన్నారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. నియంతృత్వం, అహంకారం చెల్లబోదని తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారని చెప్పారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేసేందుకు బ్యాంకులతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని గవర్నర్ అన్నారు. అలాగే ఉద్యోగాల భర్తీపై యువత ఎలాంటి అపోహలకూ గురికావద్దని సూచించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన పూర్తి అయిన వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలు అవుతుందని ఆమె హామీ ఇచ్చారు. ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన క్షణం నుంచి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యాచరణ మొదలైందన్నారు. ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలులోకి వచ్చిన విషయం మీకు తెలుసునన్నారు. దీనిలో భాగంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 11 కోట్ల పైబడి మహిళా సోదరీ మణులు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం ఎంతో సంతోషకరమని తెలిపారు. గత పాలకుల నిర్వాకంతో ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నంగా మారినా, వ్యవస్థలు గాడి తప్పినా అన్నింటినీ సంస్కరించకుంటూ, సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతున్నాం. తెలంగాణ అభివృద్ధిలో ప్రపంచంతో పోటీ పడేలా, సంక్షేమంలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించేలా రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పట్టుదలతో ముందుకు సాగుతోందన్నారు.

ప్రజా ప్రభుత్వ తొలి ప్రాధాన్యత ప్రజా సంక్షేమమేనన్నారు. ప్రజల ఉద్యమ ఆకాంక్షలే ఈ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలాలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. అందుకే డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు ప్రజల నుండి పథకాల కోసం దరఖాస్తులు స్వీకరించామని, ఈ కార్యక్రమంలో 1,25,84,383 దరఖాస్తులు ప్రభుత్వానికి అందాయి. వీటిలో ఐదు గ్యారెంటీలకు సంబంధించి 1,05,91,636 దరఖాస్తులు కాగా, ఇతర అభ్యర్థనలకు సంబంధించి 19,92,747 దరఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను ప్రస్తుతం శాఖల వారిగా క్రోడీకరించి, కంప్యూటరీకరించి వాటి పరిష్కారానికి కార్యచరణ ప్రణాళిక రూపొందుతోందని వెల్లడించారు. రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం సిఎం రేవంత్ సారథ్యంలోని బృందం దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కావడం, గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.40,232 కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకోవడం తెలంగాణ పురోగమనానికి సంకేతమన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని, వారి బృందాన్ని అభినందిస్తున్నానన్నారు. ఈ ప్రయత్నం రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధికి, తద్వారా ఉపాధి అవకాశాల కల్పనకు ఉపకరిస్తుందని విశ్వసిస్తున్నానని తెలిపారు. రైతుల విషయంలో తమ పభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉందని, వరంగల్ డిక్లరేషన్ అమలుకు కార్యచరణతో పాటు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రజలకు ఒక విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాను. గత ప్రభుత్వం ఏనాడు సామాన్యులకు అందుబాటులో లేదని, కష్టమొస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి నెలకొందని, పేదల కన్నీళ్లు తుడిచే నాధుడు లేని పాలన గతంలో చూశామని, ఇప్పుడు తెలంగాణ ప్రజాస్వామ్య పాలనలో ఉందన్నారు. మహాత్మ జ్యోతి రావు పూలే ప్రజా భవన్‌లో ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు మంత్రులు అందుబాటులో ఉంటున్నారు. సచివాలయంలో సామాన్యుడు సైతం వచ్చి ముఖ్యమంత్రిని, మంత్రులను కలిసి సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ వచ్చిందని వెల్లడించారు.

ప్రజావాణి కార్యక్రమాన్ని కేవలం హైదరాబాదుకే పరిమితం చేయకుండా క్షేత్ర స్థాయిలో అమలు చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన పాలన మొదలైందన్నారు. ప్రజల హక్కులను, స్వేచ్ఛను గౌరవించే పాలన తెలంగాణలో ఉంది అని చెప్పడానికి గర్విస్తున్నానన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పూర్తితో పేద, బడుగు, బలహీన వర్గాలు, గిజనులు, మైనారిటీ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రజా పాలన అడుగులు వేస్తోందన్నారు. ఇదే స్పూర్తితో ఇక ముందు కూడా పాలన సాగాలని, అభివృద్ధిలో తెలంగాణ అత్యున్నత శిఖరాలకు చేరాలని సంక్షేమంతో ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని మనసారా కోరుకుంటున్నానని అంబేద్కర్ చెప్పిన కొటేషన్‌తో తన ప్రసంగాన్ని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ముగించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News