Wednesday, January 22, 2025

భూతాపం బారిన భావితరం

- Advertisement -
- Advertisement -

భూ ఉపరితలంపై చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు జీవజాలానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి. బొగ్గు, సహజ వాయువు, పెట్రోల్ వంటి శిలాజ ఇంధనాల వాడకం వల్ల కర్బన ఉద్గారాలు అపరిమితంగా వెలువడి, వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా భూతాపం పెరిగిపోయి, మానవ మనుగడకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాగే కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి భూమిపై పలు రకాల జీవజాతులు అంతరించే ప్రమాదం ఉందంటున్న శాస్త్రవేత్తల హెచ్చరికలను ప్రపంచ దేశాలు చెవినపెట్టిన దాఖలాలు కనిపించటం లేదు.

వాతావరణంలో ప్రతికూల మార్పులు గర్భస్థ శిశువులపైనా ప్రభావం చూపుతున్నాయంటూ వెలుగులోకి వచ్చిన తాజా అధ్యయనం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. వాతావరణ మార్పుల వల్ల భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మంది శిశువులు నెలలు నిండకముందే పుడతారని యూనివర్శిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకుల బృందం చేపట్టిన అధ్యయనంలో వెల్లడికావడం కలవరం కలిగించే విషయం. చిన్నారుల ఆరోగ్యంపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని పరిశోధనకు నాయకత్వం వహించిన కోరే బ్రాడ్ షా విస్పష్టంగా చెప్పారు. తీవ్రమైన శీతల వాతావరణం వల్ల చిన్నారుల్లో శ్వాసకోశ సంబంధిత సమస్యలు, కరవు, అధిక వర్షాల వల్ల ఎదుగుదలకు సంబంధించిన సమస్యలు, అత్యధిక ఉష్టోగ్రతల వల్ల నెలలు నిండక ముందే పిల్లలు పుట్టడం వంటి సమస్యలు ఇప్పటికే చోటు చేసుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

దక్షిణాఫ్రికాలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చిన్నారులు మృత్యువాత పడుతున్నారంటూ అధ్యయనవేత్తలు చేస్తున్న హెచ్చరికలు మరీ ఆందోళనకరం. ఏ ఏటికాయేడు పెరిగిపోతున్న భూతాపానికి ముకుతాడు వేసేందుకు 196 దేశాల మధ్య కుదిరిన పారిస్ ఒప్పందం ఈ దిశగా సాధించిన ప్రగతి అంతంత మాత్రమే. 2015లో కుదిరిన ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం.. ఈ శతాబ్ది చివరి నాటికి భూ ఉష్ణోగ్రతలో పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు కట్టడి చేయడం. ఇందులో భాగంగా కర్బన ఉద్గారాలను అరికట్టేందుకు ప్రపంచ దేశాలు ప్రతిన బూనినా అగ్రరాజ్యం అమెరికా సహా అనేక దేశాలు లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఉన్నాయి.

ఇదే విషయాన్ని ఐరోపా వాతావరణ మార్పుల సంస్థ కోపర్నికస్ తాజా నివేదిక సైతం కళ్లకు కట్టింది.ఈ ఏడాది ఆరంభంలో భూతాపం సగటు పెరుగుదల 1.52 డిగ్రీల సెల్సియస్ మేర నమోదైనట్లు ఆ నివేదిక పేర్కొనడం ప్రపంచ దేశాల నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. 2030లోగా కర్బన ఉద్గారాలను అధిక శాతం తగ్గించేందుకు కంకణం కట్టుకున్న భారత దేశం మాత్రమే ఆ దిశగా తన వంతు కృషి చేస్తోందని క్లైమేట్ ట్రాన్స్ పరెన్సీ సంస్థ ప్రశంసించడం భారతీయులుగా మనకు ఊరట కలిగించే విషయం. చైనా, అమెరికా, యురోపియన్ యూనియన్ కంటే మన దేశం తక్కువ కర్బన ఉద్గారాలను వెలువరిస్తూ, వాటిని తగ్గించడంలోనూ ముందు వరుసలోనూ ఉంది.

ఇప్పటికే వక్షోజ, గర్భాశయ కేన్సర్లు భారత మహిళల ఉసురు తీస్తున్నాయి. మన దేశంలో కొత్తగా వెలుగు చూస్తున్న కేన్సర్ కేసులలో వక్షోజ, గర్భాశయ, నోటి కేన్సర్లు 32 శాతమని గ్లోబల్ కేన్సర్ అబ్జర్వేటరీ తాజా వివరాలు చెబుతున్నాయి. ఇక భారత దేశంలో ఏటా సంభవిస్తున్న మరణాల్లో 27 శాతం హృద్రోగ సంబంధితమైనవే. వీటికితోడు పుట్టబోయే పిల్లలు, నవజాత శిశివులు సైతం వాతావరణ వైపరీత్యాలబారిన పడతారంటూ వెలువడిన తాజా నివేదిక కలవరం కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలపరంగా నివాసయోగ్యం కాని ప్రాంతాలలో జీవిస్తున్నవారు 60 కోట్ల మంది కాగా, ఈ శతాబ్దం చివరికి ఈ సంఖ్య 300 కోట్లకు చేరుకుంటుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచమంతటా భూతాపం పెరిగిపోవడానికి కారణం కర్బన ఉద్గారాలను కట్టడి చేయలేకపోవడమే. ప్రకృతి వైపరీత్యాల విలయ తాండవాన్ని గమనిస్తున్న ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్ ‘గ్లోబల్ వార్మింగ్ శకం ముగిసింది.. గ్లోబల్ బాయిలింగ్ శకం మొదలైంది’ అంటూ ఒక సందర్భంలో చేసిన వ్యాఖ్య పరిస్థితి తీవ్రతను ఎత్తి చూపుతోంది. కాబట్టి లక్ష్యాలు నిర్దేశించుకోగానే సరికాదు. వాటి సాధనకు మనసా వాచా కృషి చేసిన నాడే భూతాపానికి ముకుతాడు వేయడం సాధ్యమవుతుంది. కర్బన ఉద్గారాలను అరికట్టేందుకు పారిస్ ఒప్పందంలో నిర్దేశించుకున్న ప్రమాణాలను అందుకునేందుకు ప్రపంచ దేశాలు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడే ముందున్న ముప్పును మానవాళి అధిగమించ గలుగుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News