Monday, December 23, 2024

భవిష్యత్తు ‘ఈవీ’లదే

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/జహీరాబాద్: భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదేనని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలోని ఆర్టీసిలో, ప్రైవేట్ వెహికల్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు. తెలంగాణ మొబిలిటీ వాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని మహీంద్రా ట్రాక్టర్ల తయారీ పరిశ్రమలో మరో భారీ యూనిట్ నిర్మాణానికి ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ భూమి పూజ చేశారు.

ఈ యూనిట్‌లో మహీంద్రా సంస్థ జోర్ గార్డ్ పేరుతో బ్యాటరీ వాహనాలను తయారు చేయనుంది. జోర్ గార్డ్ శ్రేణిలో మహీంద్రా రూపొందించిన మొదటి శ్రేణి వాహనాన్ని స్వయంగా కెటిఆర్ నడుపుకుంటూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి తెలంగాణ అడ్డాగా మారాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి సంబంధించిన అన్ని రకాల పార్ట్ తయారయ్యే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. హైదరాబాద్‌లో ఫిబ్రవరి నెలలో జరిగిన తెలంగాణ మొబిలిటీ వాలీ ద్వారా ఎలక్ట్రిక్ తయారీ పరిశ్రమల కోసం ఒప్పందాలు చేసుకున్నామని కెటిఆర్ గుర్తు చేశారు.

21 రోజుల్లో అనుమతులు

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రిక్ పాలసీ నచ్చి రూ. 1,000 కోట్ల పెట్టుబడిని జహీరాబాద్‌లో పెట్టడం సంతోషంగా ఉందని కెటిఆర్ తెలిపారు. కొత్తగా వచ్చే కంపెనీల్లో స్థానిక యువతకు పెద్దపీట వేసి ఉద్యోగాలు ఇస్తామన్నారు. జహీరాబాద్ ప్రాంతంలోని స్థానిక యువత కోసం ప్రభుత్వ పరంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, ఉద్యోగాలు రావాలంటే యువత స్కిల్ పెంచుకోవాలని కెటిఆర్ సూచించారు.

23,000 పరిశ్రమలు…రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు

రాజకీయ స్థిరత్వం, శాంతిభద్రతలు, పారదర్శక విధానం వల్ల రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు, వేల పరిశ్రమలు వచ్చాయని కెటిఆర్ స్పష్టం చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు టిఎస్ ఐపాస్ విధానం తీసుకువచ్చామని తెలిపారు. టిఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమ స్థాపనకు కావాల్సిన అన్ని అనుమతులను 21 రోజుల్లో ఇస్తున్నామని ఆయన తెలిపారు. టిఎస్ ఐపాస్ పాలసీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ వంటి మౌలిక వసతులు కల్పించామన్నారు. టిఎస్ ఐపాస్ విధానం ద్వారా ఇప్పటివరకు 23,000 పైగా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని కెటిఆర్ వెల్లడించారు. ఈ క్రమంలోనే వీటి ద్వారా రూ.3.30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని కెటిఆర్ తెలిపారు. 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పారిశ్రామిక విధానం తెలంగాణలో ఉందని ఆయన పునరుద్ఘాటించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు నైపుణ్యాలు కల్పించేలా జహీరాబాద్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని కెటిఆర్ పేర్కొన్నారు.

స్థానిక యువతకు ప్రాధాన్యం ఇవ్వాలి

ఉపాధి కల్పనలో స్థానిక యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని కెటిఆర్ పరిశ్రమల ప్రతినిధులకు సూచించారు. యువత సైతం నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవాలని, అవకాశాలను అందిపుచ్చుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలని ఆయన హితవు పలికారు. పురపాలకల్లో పారిశుధ్యం కోసం విద్యుత్ వాహనాలను వినియోగించే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, స్థానికంగా తయారు చేసే పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తామని కెటిఆర్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News