Monday, December 23, 2024

భవిష్యత్తు అంతా మేధో సంపత్తి హక్కులదే

- Advertisement -
- Advertisement -

ఉద్యాన వర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ నీరజ ప్రభాకర్

మనతెలంగాణ/హైదరాబాద్: భవిష్యత్తులో ప్రతి అంశంలో మేధో సంపత్తి హక్కుల ప్రమేయం ఉంటుందని, కాబట్టి పరిశోధకులు, ప్రొఫెసర్లు మేధో సంపత్తి హక్కుల పరిరక్షణకు సంసిద్ధం కావాలని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వ విద్యాలయం వైస్ ఛాన్స్లర్ డాక్టర్ బి. నీరజ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఉద్యాన విశ్వవిద్యాలయం – మేధో సంపత్తి హక్కుల విభాగం సంయుక్తంగా ‘తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటల వాణిజ్య పంధాలో మేధో సంపత్తి హక్కుల పాత్ర’ పై నిర్వహించిన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉద్యాన రంగంలో సైతం మేధో సంపత్తి హక్కులకు చాలా ప్రాధాన్యం ఉన్నదని, భవిష్యత్తులో రైతులకు, పంటలకు లాభాలు తెచ్చి పెట్టేలా మేధో సంపత్తి హక్కుల ను మార్చుకోవాలని ఆమె పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో భౌగోళిక గుర్తింపుకు అర్హత ఉన్న పలు ఉద్యాన పంటలపై సర్వేలు, పరిశోధనలు నిర్వహిస్తున్నామని, గణాంకాలు సేకరిస్తున్నామని త్వరలోనే వాటికి భౌగోళిక గుర్తింపు రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేస్తామని చెప్పారు. విద్యార్థులు చేపట్టిన పరిశోధనలో మేధోసంపత్తి హక్కులు పరిరక్షించేందుకు అవకాశాలుంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసేందుకు సిద్ధం కావాలని వైస్ ఛాన్స్లర్ డాక్టర్ నీరజ ప్రభాకర్ పిలుపునిచ్చారు. భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తుల ద్వారా 20 నుంచి 30శాతం అధిక ధరను రైతులు పొందుతున్నట్టు ప్రముఖ అడ్వకేట్, రిజల్యూట్ ఫర్ ఐపీ, లీగల్ హెడ్ సుభాజిత్ సాహా అన్నారు. ఉద్యాన పంటల్లో భౌగోళిక గుర్తింపులు, కాపీరైట్ ల పై ఆయన కీలక ఉపన్యాసం చేశారు. అనంతరం మాట్లాడుతూ భౌగోళిక గుర్తింపు పొందిన పంటల ఉత్పత్తిదారులు కచ్చితంగా ఆ లోగోను తమ ఉత్పత్తులపై ముద్రించుకుని, ఎగుమతులపై దృష్టి సారించాలని సూచించారు.

రోజురోజుకు తగ్గిపోతున్న చేర్యాల చేతి పెయింటర్ల సంఖ్యను కాపాడుకోవడంతో పాటు ఆ ఉత్పత్తులను అందరూ కచ్చితంగా కొని వారిని ప్రోత్సహించాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో మేధోసంపత్తి హక్కులకు అర్హత కలిగిన అనేక ఉత్పత్తులు పుష్కలంగా ఉన్నాయి అని సాహా చెప్పారు. పెన్సిల్ దగ్గర నుంచి స్పేస్ షిప్ వరకు నావాల్టి, ఇన్వెంటివ్ స్టెప్, ఇండస్ట్రియల్ అప్లికేషన్ ఉంటే, పేటెంట్ గా గుర్తింపు పొందవచ్చు అని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేటెంట్ ఏజెంట్ డాక్టర్ రాధిక వంగాల పేర్కొన్నారు. పేటెంట్ అంటే ఏమిటి? పేటెంట్ గా గుర్తింపు పొందాలంటే కావాల్సిన కనీస అర్హతలు? పేటెంటింగ్ విధానం, పేటెంట్ వచ్చిన తర్వాత ఎలా పరిరక్షించుకోవాలి అనే అంశాల పైన ఆమె ఉపన్యాసం చేశారు. తాము చేసే పరిశోధనలో పేటెంట్ గుర్తింపుకు అవకాశం ఉన్నదని ఈ విషయం చాలామందికి తెలియదని ఆమె చెప్పారు. మేధో సంపత్తి హక్కుల సంఖ్య ఒక సంస్థ యొక్క పనితనానికి కొలమానంగా పరిగణించ బడతాయని వర్సిటీ డీన్ ఆప్ హార్టికల్చర్ డాక్టర్ అడపా కిరణ్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో పీజీ డీన్ డా. ఎం రాజశేఖర్, వర్సిటి మేధాసంపత్తి హక్కుల పరిరక్షణ విభాగం నోడల్ ఆఫీసర్ డాక్టర్ పిడిగం సైదయ్య, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News